పుర‌పాల‌క ఎన్నిక‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా అర్థాంత‌రంగా నిలిచిపోయిన నోటిఫికేష‌న్ రావ‌డంతో ఎన్నిక‌ల హ‌డావిడి షురూ అయింది.  ఆ ప్రకటనతో 16 సంవ‌త్స‌రాల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగబోతున్నాయి. వార్డుల పున‌ర్విభ‌జ‌న‌, స‌మీప గ్రామాల‌ను న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో విలీనం చేయ‌డంలాంటి కార‌ణాల‌పై కొన్నేళ్లుగా న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌కు గుంటూరు దూర‌మైంది. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి కూడా దూర‌మైంది. తాజా నోటిఫికేష‌న్‌తో ఒక్కసారిగా గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ  పరిధిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు గుంటూరు మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి వ్యూహాలు ర‌చిస్తున్నాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న  వైసీపీ సత్తా చాటుకొని తొలిసారిగా గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ పీఠం కైవ‌సం చేసుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది.  జీఎంసీ పరిధిలోని రెండు నియోజకవర్గాలైన తూర్పు, పశ్చిమలో తమదే పెత్తనం అని.. అది కలిసొచ్చే అంశం అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.  అయినా సీనియర్లు పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్‌నాయుడు రేసులో ఉన్న‌ప్ప‌టికీ మేయర్‌ అభ్యర్థి ఏవరన్నది స్పష్టత  లేదు. ఇప్పటికే కార్పొరేట్‌ అభ్యర్థులను ప్రకటించటంతో వారు మంగళవారం ప్రచారం చేపట్టారు. నగరంలో పట్టున్న నేతలు ఉండటంతో తమ గెలుపు ఖాయమంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో అభ్యర్థుల గెలుపు భారం ఎమ్మెల్యే ముస్తఫా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు పశ్చిమలో కీలకంగా మారారు. మరోవైపు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ప‌శ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి‌ ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఆయన స్వయంగా ప్రచారంలో పాల్గొనటంతో పాటు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్‌ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయంటూ వైసీపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. 16 సంవ‌త్స‌రాల ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వాలు స‌మ‌స్య‌ల‌ను ఎక్క‌డ నిర్ల‌క్ష్యం చేశాయి?  వాటిని ఎందుకు ప‌రిష్క‌రించ‌లేదు? న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో గ‌తంలో మేయ‌ర్లుగా ప‌నిచేసిన రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థ‌ల‌క‌న్నా తామే మెరుగైన పాల‌న అందిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు హామీలు గుప్పిస్తున్నారు. అంతిమ ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాతే ఎవ‌రేం చేయ‌గ‌ల‌ర‌నేది అర్థ‌మ‌వుతుంద‌ని న‌గ‌ర‌వాసులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: