కరోనా టైమ్ లో ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్లు బాగా ఎక్కువయ్యాయి. చిన్న చిన్న షాపుల్లో కూడా నగదు ట్రాన్సాక్షన్లు బాగా తగ్గిపోయాయి. ఏ చిన్న అవసరానికైనా.. గూగుల్ పే ఉందా, ఫోన్ పే ఉందా అని అడగడం పరిపాటి అయింది. పల్లెటూళ్లలో కూడా, చిన్న చిన్న షాపులు కూడా వీటిని ఉపయోగించడం, క్యూఆర్ కోడ్ ని డిస్ ప్లే చేయడం చూస్తూనే ఉన్నాం. మరి ఇన్నిచోట్ల ఉపయోగంలో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ విధానం, ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నారు అధికారులు. అనుకున్నదే తడవుగా దాన్ని అమలులో పెట్టబోతున్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం అమలులో లేదని తొలిసారిగా ఏపీఎస్ఆర్టీసీ అమలు చేస్తోందని అంటున్నారు అధికారులు. ఏపీఎస్‌ఆర్టీసీ క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ఆర్టీసీ టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమకు వచ్చిన క్యూఆర్ కోడ్ ని బస్సు డ్రైవర్ సీటు పక్కనే ఉన్న ఈపోస్ మిషన్ కి చూపిస్తే చాలు. అక్కడ సిగ్నల్ ఓకే అయితే నేరుగా వెళ్లి సీట్లో కూర్చోవచ్చు. త్వరలో సాధారణ టికెట్లు తీసుకునే విధానానికి కూడా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ని తీసుకు రావాలనుకుంటున్నారట. ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే.. ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.

అంతా ఆన్ లైన్ లోనే..
ఆర్టీసీలో రోజూ 60 లక్షల సీట్ల వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో 1.40 లక్షల సీట్లకు మాత్రమే ఆన్ ‌లైన్ ‌లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉంది. ఈ సీట్ల సంఖ్యకు 15 రెట్లు అంటే దాదాపు 20 లక్షల సీట్లకు ఆన్ ‌లైన్ ‌లో బుక్‌ చేసేలా అవకాశం కల్పించబోతున్నారు అధికారులు. పల్లె వెలుగు బస్సుల నుంచి హైటెక్ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. ఈ ప్రాజెక్టులో క్లౌడ్‌ బేస్డ్‌ టెక్నాలజీ వినియోగిస్తారు. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ ప్రోత్సహించేందుకు యూటీఎస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామంటున్నారు.

యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ తో డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్టీసీలో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నారు. ఇకపై ఆర్టీసీలో టికెట్ల బుకింగ్ కి, సమాచారం తెలుసుకోడానికి, ఖాళీల వివరాలు చూసుకోడానికి, బస్ పాస్ లు తీసుకోడానికి కూడా ఒకటే యాప్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: