ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈరోజు సాయంత్రంతో తెర‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొని రోడ్‌షో నిర్వ‌హించారు.నగరంలో పలు రోడ్‌షోల్లో పాల్గొన్న చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. అమరావతి ద్రోహి, జనం కన్నెర్ర చేస్తే నువ్వు తాడేపల్లి వదిలి వెళ్లాల్సిందేనంటూ హెచ్చరించారు.

తెలుగుదేశం, సీపీఐ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు హెచ్చ‌రిక‌లు జారీచేశారు. అదేక్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు కూడా చేసిన త‌ప్పులు సుతిమెత్త‌గా ఎత్తిచూపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు ఈసారి ఓటేస్తే వారిని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని, ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌వుతాయ‌ని చంద్రబాబు అన్నారు. ముస్లింలు వైసీపీ ట్రాప్‌లో పడటం వల్లే రంజాన్‌ తోఫా, పెళ్లి కానుకతో పాటు ఇతర పథకాలు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము ఇచ్చిన రంజాన్‌ తోఫా, పెళ్లి కానుక, ఇమామ్‌, మౌజన్లకు జీతాలు ఇప్పుడెక్కడున్నాయని ప్రశ్నించారు. ఎన్సార్సీ విషయంలో వైసీపీ ప్రభుత్వం నేరుగా మాట్లాడలేని పరిస్ధితుల్లో ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ముఖ్య‌మంత్రి జగన్‌ అమరావతి ద్రోహి అని, గుంటూరు ద్రోహి అని, మీ పొట్ట కొట్టిన జగన్‌కు ఓటేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపైనా చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. గుంటూరు ఎమ్మెల్యే గుట్కా తయారు చేస్తాడని, మీరు తినాలి, చావాలి, ఆయన డబ్బులు సంపాదించుకుంటాడన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా బయట తిరిగి అందరికీ అంటించాడని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు పది రూపాయల సంక్షేమం ఇచ్చి వారి నుంచి వంద రూపాయలు వివిధ రూపాల్లో లాగేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే రేపు పెట్రోల్‌ వంద రూపాయల నుంచి రూ.200 అవుతుందని, తాను ప్రజల్ని అప్రమత్తం చేయడానికే వచ్చానని, ఓట్ల కోసం కాదన్నారు. ఓటేయకపోతే పించన్‌ ఇవ్వం, రేషన్ ఇవ్వం, అమ్మఒడి ఇవ్వమని బెదిరిస్తున్న‌వారి తాత సొత్తా ఆ సొమ్ములు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: