తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌ధాన పార్టీల్లో హ‌డావిడి మొద‌లైంది. తాజాగా పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి ఉత్సాహంలో ఉన్న వైసీపీ తిరుప‌తి లోక్‌స‌భ స్థానాన్నీ సునాయాసంగా గెల‌వ‌గ‌ల‌మ‌న్న ధీమాతో ఉంది. పార్టీ అధికారంలో ఉండ‌టం, తిరుప‌తి లోక్‌స‌భ స్థానం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యే‌లే ఉండ‌టం ఆ పార్టీకి క‌లిసొచ్చే అంశాలు. ఆర్థిక‌, అంగ‌బ‌లాల‌కు లోటు లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ‌వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి ఆయ‌న‌కు ఫిజియోథెర‌పిస్టుగా ప‌నిచేశారు. వ్య‌క్తిగ‌త ప్రాచుర్యం కంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, అధికార పార్టీకి ఉండే స‌హ‌జ‌మైన అనుకూల‌త‌ల‌తో ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాలో వైసీపీ శ్రేణులున్నాయి.

స‌త్తా చాటాల‌ని.. టీడీపీ
పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మితో డీలాప‌డిన తెలుగుదేశం పార్టీ తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌డంద్వారా స‌త్తా చాటాల‌ని భ‌విస్తోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌లు కొంత ప్రాంతానికే ప‌రిమిత‌మ‌వ‌డంవ‌ల్ల ప్ర‌లోభాలు, ఒత్తిళ్లు ప‌నిచేస్తాయ‌ని, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి చాలా ఎక్కు వ కాబ‌ట్టి అధికార పార్టీ నిర్బంధాలు, ప్ర‌లోభాల ప్ర‌భావం ఓట‌ర్ల‌పై ఉండ‌ద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. తెలుగుదేశం బ‌ల‌మెంత ఉంటుందో ఈ ఎన్నిక‌ల్లో అంద‌రికీ చాటాల‌నే కృత‌నిశ్చ‌యంతో త‌మ పార్టీ ఉంద‌ని, ప‌న‌బాక ల‌క్ష్మిని గెలిపించుకొని త‌మ‌బ‌లం నిరూపించుకుంటామ‌ని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

జాతీయ పార్టీలు..
జాతీయ‌పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. తిరుప‌తి ఆధ్యాత్మిక‌ న‌గ‌రం కావ‌డం, స్థానికంగా ఉండే సామాజిక స‌మీక‌ర‌ణాలు, జ‌న‌సేన పార్టీతో పొత్తు త‌మ‌కు క‌లిసివ‌స్తాయ‌ని బీజేపీ భావిస్తోంది. హిందూ ఓట‌ర్ల‌ను ఏకీకృతంచేస్తే త‌మ అభ్య‌ర్థి దాస‌రి శ్రీ‌నివాసులుకానీ, మ‌రొక‌రుకానీ సునాయాస‌మైన గెలుపు సాధించ‌వ‌చ్చ‌నేది ఆ పార్టీ నేత‌ల ఆలోచ‌న‌. ఇక కాంగ్రెస్ త‌ర‌ఫున అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది తేల‌క‌పోయినా సుదీర్ఘ‌కాలం ఇక్క‌డి నుంచి ఆ పార్టీకి త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించిన చింతామోహ‌న్ కొద్దిరోజులుగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. జాతీయ‌స్థాయి పార్టీగా తమ‌కు ఆద‌ర‌ణ ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: