ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఉప పోరులో భారీ మెజారిటీతో గెలవాలని అధికార వైసీపీ చూస్తోంది. ఇక తిరుపతిలో ఇప్పుడైనా సత్తా చాటాలని టీడీపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతుంది. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ సైతం జనసేనతో పొత్తు పెట్టుకుని, టీడీపీ-వైసీపీలకు చెక్ పెట్టాలని అనుకుంటుంది.


అయితే బీజేపీ బరిలో ఉన్నా సరే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మధ్యే జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక అధికారంలో ఉన్న వైసీపీకి అడ్వాంటేజ్ బాగా ఉంది. జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాలు ఇవన్నీ వైసీపీకి భారీ మెజారిటీ తెచ్చేలా ఉన్నాయి. 2019 ఎన్నికల్లోనే ఇక్కడ వైసీపీకి 2 లక్షల పైన మెజారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు 3 లక్షల పైనే మెజారిటీ తెచ్చుకోవాలని వైసీపీ చూస్తోంది.


ఇటీవల పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయాలని సాధించింది. కాబట్టి తిరుపతి పార్లమెంట్‌లో వైసీపీ గెలుపు దాదాపు ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో బీజేపీ తిరుపతిలో గెలిచేస్తామని సవాళ్ళు విసురుతుంది. జనసేనని పక్కకు తప్పించి మరీ సీటు లాక్కున్న బీజేపీకి నోటా కంటే ఓట్లు దాటవని కొందరు విశ్లేషకులు మాట్లాడుతున్నారు.


అయితే వైసీపీ పెద్దగా బీజేపీని టార్గెట్ చేసుకుని ముందుకెళ్ళదు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ-జనసేనలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడుతున్నారు. ఇక విజయసాయికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది.


అయితే విజయసాయి బీజేపీని టార్గెట్ చేయడం వెనుక కారణం ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పోటీలో ఉండటం టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే జనసేన పోటీలో ఉంటే టీడీపీకి పడే కొన్ని ఓట్లు సైతం అటే వెళ్తాయి. ఇప్పుడు బీజేపీ పోటీలో ఉండటం వల్ల, జనసేనకు ఓటు వేయాలనుకునే వారు కొందరు టీడీపీ వైపుకు వెళ్ళే ఛాన్స్ లేకపోలేదు. అందుకే బీజేపీ-జనసేనలు డ్రామా ఆడుతున్నాయని విజయసాయి గట్టిగా టార్గెట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: