తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్టాగా పిలుస్తుంటారు. ఆయన ఎత్తులను ప్రత్యర్థి పార్టీల నేతలు కనిపెట్టలేరని చెబుతుంటారు. అందువల్లే ఆయన రెండు సార్లు అధికారంలోకి వచ్చారనే వాదన ఉంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుభవంలో జూనియరే. అయితే ఏపీ సీఎం జగన్ తో పోల్చుతూ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. రెండు పార్టీల నేతలంతా కొన్ని రోజులుగా సాగర్ లోనే మకాం వేశారు. బుధవారం హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. నాగార్జున సాగర్ అసెంబ్లీతో పాటు ఏపీలోని తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతిలో కూడా పోటాపోటీగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోసం తిరుపతిలో జగన్ బహిరంగ సభను ముందు షెడ్యూల్ చేశారు. తర్వాత కరోనా విజృంభిస్తున్నందున ప్రజారోగ్యం కోసం సభను రద్దు చేసుకుంటున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

సభ విషయంలోనూ జగన్ తో పోల్చుతూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. జనాల ఆరోగ్యం కంటే కేసీఆర్ కు ఓట్లే ముఖ్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చిన్న వయసున్న జగన్ కున్న జ్ఞానం కేసీఆర్ కు లేదన్నారు. దేవాలయాల్లో కార్యక్రమలు బంద్ చేసిన కేసీఆర్ .... బహిరంగ సభ నూ ఎలా పెడుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే కేసిఆర్ దిగజారుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సభపై ఎలెక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు ఉత్తమ్. టీఆర్ఎస్ నేతలు వందలాది వాహనాల్లో తిరుగుతున్నారని చెప్పారు. లోకల్ పోలీస్ సహకారం తో టీఆర్ఎస్ నేతలు డబ్బుల పంపిణీ చేస్తున్నారని ఉత్తమ్ మండిప్డడారు.సిఎం స్థాయి వ్యక్తి ఇంత గాలీజ్ గా వ్యవహరించడం అర్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా బాగా విస్తరిస్తున్న సమయం లో కేసీఆర్ రెండో సారి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: