ఒక‌వైపు ఎండ‌లు మండిపోతుంటే.. మ‌రోవైపు నాగార్జున సాగ‌ర్‌లో ఉప ఎన్నిక‌ల వేడి సెగ‌లు రేపుతోంది.. మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య సాగిన పోటాపోటీ ప్ర‌చారం నేటితో ముగుస్తుంది.. ఈ ప్ర‌చార‌ప‌ర్వంలో కాంగ్రెస్ నేత‌లంతా ఏక‌తాటిపైకి రావ‌డం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుంది. నాగార్జున సాగ‌ర్ ఉప పోరులో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బ‌రిలోకి దిగారు. జానారెడ్డి 1978 నుంచి వ‌రుస‌గా ప‌ద‌కొండోసారి పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే పోటీప‌డిన ప‌ది ద‌ఫాల్లో.. ఏడు ద‌ఫాలు జానానే విజ‌యబావుటా ఎగుర‌వేశారు. 2018 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మిపాలైన జానారెడ్డి.. ప్ర‌స్తుతం జ‌రిగే ఉప పోరులో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ప్ర‌స్తుతం జానారెడ్డి గెలుపుకోసం కాంగ్రెస్ నేత‌లంతా ఒకేతాటిపైకి వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. సాధార‌ణంగా కాంగ్రెస్‌లో వ‌ర్గాలు ఎక్కువ‌. ఒక వ‌ర్గం త‌రుపువారు బ‌రిలో నిలిస్తే మ‌రో వ‌ర్గంవారు ప్ర‌చారానికి దూరంగా ఉంటూ అల‌క‌పాన్పు ఎక్కుతారు. అయితే సాగ‌ర్ ఉపపోరులో అలాంటి ప‌రిస్థితికి తావులేకుండా కాంగ్రెస్ నేత‌లంతా ఒకేతాటిపైకి వ‌చ్చి జానారెడ్డి గెలుపుకోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. జానారెడ్డికి మ‌ద్ద‌తుగా నిలిచి ప్ర‌‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు చెక్‌పెట్టాలంటూ సాగ‌ర్ ఓట‌ర్ల‌కు వారు పిలుపునిస్తున్నారు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్ని నింపుతున్నాయి. మ‌రోవైపు ఎంపీ కోమ‌టిరెడ్డి లాంటి కీల‌క‌నేత‌లు ఓ అడుగు ముందుకేసి జానారెడ్డిని గెలిపిస్తే ఆయ‌న రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి అంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

జానారెడ్డిసైతం ఉప‌పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ చివ‌రి ప‌ది, ప‌దిహేను రోజులే ప్ర‌చారం చేసే ఆయ‌న‌.. ఈసారి త‌న ఎత్తుగ‌డ‌ను మార్చారు. అధికార పార్టీ ప్ర‌తిమండ‌లానికో ఇన్‌ఛార్జిని ప్ర‌క‌టించ‌క ముందునుంచే ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ప్ర‌తీ గ్రామం తిరుగుతూ.. ప్ర‌తీ గ‌డ‌ప‌ను త‌డుతున్నారు. జానాకు తోడు ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు విస్తృత ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి గ్రామ గ్రామాన ప్ర‌చారాన్ని హోరెత్తిస్తుండ‌టంతో ఉప‌పోరులో జానా గెలుపుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశ‌లు చిగురిస్తున్నాయి. రోజురోజుకు రాష్ట్రంలో బ‌ల‌హీన ప‌డుతున్న కాంగ్రెస్‌కు జానారెడ్డి గెలిస్తే పార్టీ పూర్వ‌వైభ‌వానికి ఓ టానిక్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం పేర్కొంటున్నారు. మ‌రి కాంగ్రెస్ నేత‌ల ఐక్య‌త జానారెడ్డిని ఏ మేర‌కు విజ‌య‌తీరాల‌కు చేర్చుతుంది.. పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌స్తుందా అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: