ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి విడతలో పదవి దక్కనివారు, ఈ రెండో విడతలో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో తమ పదవులని కాపాడుకోవాలని ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులు చూస్తున్నారు. అయితే ఎలా చూసుకున్నా, పలువురికి జగన్ ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించడం ఖాయమని తెలుస్తోంది.


ముఖ్యంగా ఇప్పుడున్న ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లో ఎవరోకరికి షాక్ తగిలేలా ఉంది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. పాముల పుష్పశ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనితలు మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో ఎవరి మీద వేటు పడుతుందో చెప్పలేని పరిస్తితి ఉంది. అయితే ఖచ్చితంగా మాత్రం ఒకరు లేదా ఇద్దరిని తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. వారి స్థానాల్లో వేరే మహిళా నేతలకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.


అయితే ఈ రెండేళ్లలో ఈ ముగ్గురు మహిళా మంత్రులు పనితీరు విషయంలో జగన్ పెద్దగా సంతృప్తిగా లేరని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు ఈ ముగ్గురు మంత్రులు రాష్ట్ర స్థాయిలో పెద్ద హైలైట్ అయిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి. హోమ్ మంత్రి కాబట్టి సుచరిత, అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నారుగానీ, మిగిలిన ఇద్దరు మంత్రులు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరోకరికి షాక్ తగిలాగానే ఉంది.


ఇక వీరి స్థానాల్లో ఛాన్స్ కొట్టేయడానికి పలువురు మహిళా ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా రోజా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నారు. అటు తొలిసారి గెలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్న విడదల రజిని, జొన్నలగడ్డ పద్మావతిలు సైతం జగన్ తమకు ఏదైనా అవకాశం ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడున్న మహిళా మంత్రుల్లో జగన్ ఎవరికి షాక్ ఇచ్చి, ఎవరికి బంపర్ ఆఫర్ ఇస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: