న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కేసుకు సంబంధించి హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌ల సంద‌ర్భంగా అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి న్యాయ‌మూర్తుల‌నే గ‌ద్దించారా? ఈ కేసులో మీకు అంత ఆస‌క్తి ఎందుకు? అని ప్ర‌శ్నించారా? త‌న వ్య‌వ‌హారశైలే ప్రభుత్వ శైలి అని ప‌రోక్షంగా చెప్పారా? అనే వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దుమారం రేపుతున్నాయి. ఏఏజీ వైఖ‌రిపై జ‌స్టిస్ ల‌లిత తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని, అత‌ని వ్యాఖ్య‌లు కోర్టు ధిక్కార‌పూరితంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.  సుధాక‌ర్‌రెడ్డి మరోసారి ఇలాంటి వ్యవహారశైలిని ప్రదర్శిస్తే చర్యలు తీసుకోడానికి న్యాయస్థానం వెనుకాడబోదని స్పష్టం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

గ‌ట్టిస్వ‌రంతో కోర్టునే భ‌య‌పెట్టిన ఏఏజీ?
ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కేసుకు సంబంధించిన వాద‌న‌లు హైకోర్టులో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. న్యాయమూర్తులు జ‌స్టిస్ సి. ప్ర‌వీణ్‌కుమార్‌, జ‌స్టిస్ కె.ల‌లిత వేర్వేరుగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాదనలు వినిపించిన ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వ్య‌వ‌హార‌శైలిని జస్టిస్ లలిత త‌న ఉత్త‌ర్వుల్లో ప్రస్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఏఏజీ కోర్టును భ‌య‌పెట్టే వ్య‌వ‌హార‌శైలితో గ‌ట్టిగా వాదించార‌ని, కోర్టు ఉత్త‌ర్వులు అమ‌లు చేశారా?  లేదా? అని అడిగిన‌దానికి ఉత్త‌ర్వుల ప్ర‌తి రాత్రి 11.00 గంట‌ల‌కు అందింద‌ని స‌మాధాన‌మిచ్చార‌ని ఇందులో ఉన్న‌ట్లు స‌మాచారం. రాత్రివేళ జైలు త‌లుపులు తెరిచి ఆసుప‌త్రికి త‌ర‌లించాలా? అని కోర్టునే ఎదురు ప్ర‌శ్నించ‌డం విస్మ‌యానికి గురిచేసింద‌ని జ‌స్టిస్ ల‌లిత త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌ట్న‌లు స‌మాచారం.

ఉద‌యం ఎందుకు అమ‌లు చేయ‌లేదు?
రాత్రి కుదరకపోతే ఉదయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే.. తాను చెప్పింది కోర్టు వినితీరాల‌నే ధోర‌ణిలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంద‌ని, సుప్రీంకోర్టులో ఎంపీ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పార‌ని జ‌స్టిస్ ల‌లిత ఈ ఉత్త‌ర్వుల్లో ప్ర‌స్తావించిన‌ట్లు లోతైన అంశాల్లోకి వెళ్లి వాదనలు వినడానికి కోర్టు అనుమతించకపోతే ‘వాకౌట్‌’ చేస్తానని  పెంచిన స్వ‌రంతో అన్నార‌ని, ఈ కేసులో కోర్టుకు ప్రత్యేక ఆసక్తి ఏమిటి? లాయర్ రాసిన లేఖను అంగీకరించి ఈ కేసును విచారించేంత ప్రత్యేకత ఏమిటి అని కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించారు అని ల‌లిత వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.

హ‌క్కులు కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంది!
కోర్టు అధికారిగా ఉప‌యోగించే పదాలపై నియంత్రణ పాటించాలని ఏఏజీకి కోర్టు హెచ్చరించింద‌ని, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే నిందాపూర్వక ఆరోపణలు చేయడం సరికాదని ఏఏజీకి హితవు పలికిన‌ట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న ఎంపీని పోలీసులు కొట్టారని, నడవలేని స్థితిలో ఉన్నారని, సంబంధిత ఫొటోలను చూడాలని లేఖ అందిన సందర్భంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు తలుపులు మూసుకొని ఉండలేర‌న్నారు. . నిందితులకు సైతం హక్కులుంటాయని, వాటిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానించార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: