దేశవ్యాప్తంగా కరోనా కేసులలో తగ్గుదల నమోదు కావడంతో.. రాష్ట్రాలు కర్ఫ్యూల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆల్రడీ అన్ లాక్ మొదలు పెట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపు మొదలైంది.

హర్యానాలో కరోనా కేసులు తగ్గుతుండటంతో జూన్‌ 1 నుంచి 9-12 తరగతులకు స్కూల్స్ తెరవాలని, క్లాసులు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్థే కూర్చోవాలని సూచించింది. సామాజిక దూరం, మాస్క్‌ ధరించడం, ఇతర కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టంచేసింది. అటు
పంజాబ్‌ ప్రభుత్వం కరోనా ఆంక్షలను జూన్‌ 10 వరకు పొడిగిస్తూనే సడలింపులకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. గుజరాత్‌ లో కరోనా కేసుల తగ్గుదల నేపథ్యంలో రాత్రికర్ఫ్యూ సమయాన్ని గంట తగ్గించారు. ఢిల్లీలో జూన్ 1నుంచి అన్ లాక్ మొదలయ్యే అవకాశాలున్నాయి. కర్ఫ్యూని ఈనెల 31వరకు పొడిగించగా.. కేసుల తగ్గుదల కొనసాగితే జూన్‌ 1 నుంచి దశలవారీగా అన్‌ లాక్‌ ప్రక్రియ చేపడుతామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ లో మాత్రం లాక్‌ డౌన్‌ను జూన్‌ 15వరకు పొడిగిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌ లో ఏప్రిల్‌ 30న లాక్ డౌన్ విధించగా అది ఈ నెల 30తో ముగుస్తుంది. ఇప్పుడు దీన్ని జూన్ 15వరకు పొడిగిస్తున్నారు. మహారాష్ట్రలో 21 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జూన్‌ 1 తర్వాత రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ తరహా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు సడలిస్తున్నట్టు చెప్పారు. కర్నాటకలో జూన్‌ 7 వరకు లాక్‌ డౌన్‌ను పొడిగించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా ఇతర రాష్ట్రాల్లో నెలాఖరు వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయి. ఈనెలాఖరులో కర్ఫ్యూ నిబంధనలపై దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఓ నిర్ణయానికి వస్తాయి. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో.. కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: