సొంత పార్టీ ప్ర‌భుత్వం పైనే తీవ్ర విమ‌ర్శ‌లు చేసి, కుట్ర‌ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజు  వ్య‌వ‌హారం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించేలా మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌లో ర‌ఘురామ‌రాజు సికింద‌రాబాద్ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఢిల్లీకి చేరుకుని అక్క‌డ ఎయిమ్స్ లో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లినా ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం-ర‌ఘ‌రామ‌రాజుల మ‌ధ్య చ‌ట్ట‌, న్యాయ‌ప‌ర‌మైన పోరు కొన‌సాగుతూనే ఉంది. ఎయిమ్స్‌లో వైద్యం అనంతరం ఆయ‌న కాలికి బ్యాండేజ్‌ల‌తోనే వెళ్లి  కేంద్ర హోంమంత్రిని క‌లిసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా ర‌ఘురామ‌రాజు ఢిల్లీలో కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌నాథ్‌సింగ్‌ను క‌లిసి మూడు పేజీల లేఖ‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా
ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఆరోప‌ణ‌లు సంచలనంగా మారాయి. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవోగా ప‌ని చేస్తున్న‌ ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి తనను ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి కాగానే ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మఫ్టీ పోలీసులు ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని తెలిపారు.

ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే త‌న‌పై సీఐడీ పోలీసుల కుట్ర‌కు ఆధారంగా 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా త‌న‌ లేఖకు రఘురామ జతపర్చారు. ఇంత‌కీ మెస్ బిల్లుల‌కీ ఈ కేసుకీ సంబంధం ఏమిటంటే.. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన‌ తీర్పు ప్రకారం… ఆర్మీ ఆస్పత్రిలో వైద్య చికిత్సకు అయ్యే బిల్లులు మొత్తం రఘురామకృష్ణరాజే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు గ‌తంలో త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆయ‌న చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం వై కేట‌గిరీ సెక్యూరిటీని క‌ల్పించింది. ఈ సిబ్బందికి అయ్యే ఖ‌ర్చు కూడా ర‌ఘురామ‌రాజే సొంతంగా భ‌రిస్తున్నారు. ఇక ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స త‌రువాత ఆయ‌న‌కు అక్క‌డి సిబ్బంది బిల్లు ఇచ్చారు. అందులో ఉన్న వివరాలు చూసి.. రఘురామకృష్ణరాజుకు ఏం జ‌ర‌గ‌బోతున్న‌దో అర్థమయింది. తనకు రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది కాకుండా.. గుంటూరు నుంచి వచ్చిన పదిహేను మంది పోలీసుల క్యాంటీన్ ఖర్చులు కూడా  ఆయ‌న‌కు ఇచ్చిన  బిల్లులో ఉన్నాయట‌. తాము ర‌ఘురామ‌రాజు కోస‌మే వ‌చ్చామ‌ని చెప్పిన ఏపీ సీఐడీ పోలీసులు అక్క‌డ బిల్లు క‌ట్ట‌క‌పోవ‌డంతో వారి ఖ‌ర్చు కూడా ఆయ‌న ఖాతాలోనే  ప‌డింది. ఇది చూసిన ర‌ఘురామ‌రాజు విష‌యం అంతా ఆరా తీసి ఏం జ‌రుగుతుందో తెలుసుకున్నార‌ట‌. ఆ బిల్లును ఇప్పుడు  త‌న‌పై జ‌రిగిన కుట్ర‌కు సాక్ష్యంగా  రాజ‌నాథ్‌సింగ్‌కు స‌మ‌ర్పించి అందుకు స‌హ‌క‌రించిన రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ కోరిన‌ట్టు తెలుస్తోంది.  ఈ అంశంపై  విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఎంపీ ర‌ఘురామ‌రాజు మ‌రోసారి ఢిల్లీ నుంచి ఆట మొద‌లుపెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: