తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి కరోనా కేసులు నమోదు అవ్వడం చాలా రేట్లు తగ్గిందనే చెప్పాలి. అదే విధంగా రికవరీ కేసుల సంఖ్య కూడా భారీగానే పెరగడంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. అటు వైద్య సిబ్బంది కూడా కరోనా పేషెంట్ల రద్దీ తగ్గడంతో గత కొంత కాలంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమిస్తున్న వారికి కాస్త విశ్రాంతి లభించింది. ఎమర్జెన్సీ కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో ఆంబులెన్స్ లు సైతం ఖాళీగా దర్శనమిస్తూ ప్రజలకు ధైర్యాన్ని పెంచాయి. దీంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత గణనీయంగా తగ్గడంతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది తెలంగాణ సర్కారు.

ముందుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతులు అత్యవసర పనుల నిమిత్తం సమయాన్ని ఇవ్వగా, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అదే రాష్ట్రంలోని ఓ గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నంగా పూర్తి లాక్ డౌన్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లాలోని దండేపల్లి అనే గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో, అక్కడ తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. నిత్యావసరాలకు మాత్రం ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు కాస్త సమయాన్ని కేటాయించగా, మిగిలిన టైమ్ లో ఎవరైనా ఇల్లు దాటి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

ఒకవేళ ఎటువంటి అత్యవసరం లేకుండా బయటకు వచ్చినట్లయితే అటువంటి వారిని అరెస్టు చేస్తామంటూ అధికారులు వెల్లడించారు. గ్రామంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉండడంతో, ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ కట్టుదిట్టమైన చర్యలు  తీసుకుంటున్నామంటూ పేర్కొన్నారు అధికారులు. అంతేకాదు ఈనెల 20 వరకు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో  గ్రామంలో ఎటువంటి శుభకార్యాలు కానీ, జనం గుమిగూడే కార్యాలు కానీ చేయరాదని సూచించారు. ఇతర వ్యక్తులు ఎవరూ ఈ గ్రామంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదే అంటూ తెలియజేశారు. ప్రస్తుతం దండేపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: