ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ కేబినెట్‌లో కొనసాగుతామా లేదా అనే విషయంపై పలువురు మంత్రులు బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసిన మొదట్లోనే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పలువురుకు ఉద్వాసన తప్పదని జగన్ చెప్పేశారు.


ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటింది. అంటే ఇంకో ఐదారు నెలల్లో కేబినెట్‌లో మార్పులు జరగనున్నాయి. దీంతో ఎవరికి చెక్ పడుతుందో అని విషయం ఉత్కంఠగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మంత్రుల్లో ఎవరు ఐదేళ్లు కొనసాగుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు 6 గురు ఉన్నారు.


పుష్పశ్రీ వాణి, నారాయణస్వామి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌లు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో పుష్పశ్రీవాణి గిరిజన శాఖ మంత్రిగా ఉంటూనే, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అటు నారాయణస్వామి ఎక్సైజ్ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుచరిత...హోమ్ మంత్రిగా, వనిత... శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, సురేష్... విద్యా శాఖ మంత్రిగా, విశ్వరూప్.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.


అయితే వీరిలో జగన్ ఎవరిని పక్కనబెడతారో ఇంకా క్లారిటీ రావడం లేదు. కాకపోతే ఈ రెండేళ్లలో మంచి పనితీరు కనబర్చిన మంత్రులని మాత్రం జగన్ ఐదేళ్లు కొనసాగించడం ఖాయం. కాకపోతే ఇదే వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్తవాళ్ళకు అవకాశం ఇస్తే పాత వాళ్ళకు చెక్ పడటం ఖాయం. ఇక ప్రస్తుత పరిస్తితుల్లో వీరిలో చాలామంది ఐదేళ్లు మంత్రి పదవిలో కొనసాగడం కష్టమని తెలుస్తోంది. మరి చూడాలి ఈ ఎస్సీ, ఎస్టీ మంత్రుల్లో ఎవరికి చెక్ పడుతుందో? అలాగే కొత్తగా ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: