పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. ఓటుకు నోటు కేసులాగా పీసీసీ నియామకం జరిగిందని ప్రధాన పోటీదారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేయడం, అధిష్టానం సీరియస్ అవడం అందరికీ తెలిసిందే. మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీకి రాజీనామా చేసారు. కాంగ్రెస్ పార్టీని వీడనంటూనే.. ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జానారెడ్డి ఎలాగూ నిత్య అసంతృప్తవాదిలాగానే కనిపిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని బతిమిలాడి మరీ నిలబెట్టాల్సి వచ్చింది అధిష్టానం. అప్పట్లనే ఆయన తనయుడు బీజేపీలోకి వెళ్తారనే వార్తలు వినిపించాయి. ఇక జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా రేవంత్ రెడ్డి నియామకంపై రగిలిపోతున్నారు. వీరంతా మూకుమ్మడిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి వెళ్తారని గుసగుసలు వినపడుతున్నాయి.


సీనియర్లకు ఆల్టర్నేట్ ఏది..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా తయారవుతున్నా.. సీనియర్లు మాత్రం వదిలి వెళ్లడానికి ఇష్టపడటంలేదు. అప్పటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు తలోపార్టీ చూసుకున్నా.. వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది ఇప్పటికీ కాంగ్రెస్ కి లాయల్ గానే ఉన్నారు. అయితే వీరంతా రేవంత్ రెడ్డి నియామకంతో బాగా హర్ట్ అయ్యారు. టీడీపీనుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై పెత్తనం చలాయించడం వీరికి సుతరామూ ఇష్టంలేదు. అందుకే పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ.. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు.


షర్మిల పార్టీకి కలిసొచ్చే అంశం..
వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా షర్మల పార్టీవైపు చూస్తారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఎన్నికలకింకా రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో ఎవరూ తొందరపడి షర్మిల వైపు వెళ్లలేదు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కల్లోలం మొదలైంది. దీంతో ముందుగానే వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధంతో, ఆయన కుమార్తె షర్మిల పెట్టిన పార్టీలోకి వెళ్తారని చెబుతున్నారు. అదే నిజమైతే.. రేవంత్ నియామకం కాంగ్రెస్ అధిష్టానం చేసిన పెద్ద తప్పు అవడం ఖాయం. రేవంత్ దూకుడు కాంగ్రెస్ కి కలిసొచ్చి తెలంగాణలో పార్టీ బలపడితే మాత్రం.. తొందరపడి పార్టీ వీడిన సీనియర్లు పశ్చాత్తాప పడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: