ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయ రంగాన్ని  కనుసైగతో శాసించిన రాజసం ఆయనది.  ప్రజల మనసు గెలుచుకున్న ప్రజా నేతగా అప్పట్లో  ఆయన చక్రం తిప్పారు. రాజకీయ చదరంగంలో కొమ్ములు తిరిగిన నాయకులు సైతం ఆయన చెప్పిందే చేస్తారు అనేంత పలుకుబడి ఉండేది. గతంలో ఈయన ముఖ్యమంత్రి కాబోతున్నారన్న వార్తలు కూడా  వినిపించాయి. అంతటి రాజకీయ దిట్ట ఈ నాయకుడు. ఆయన ఇంట కార్యం అంటే మహా మహా నేతలు సైతం ఇంటి ముందు వాలి పోవాల్సిందే. అంతటి ఘనత కలిగిన నేత ఇప్పుడు కేవలం ఒక నియోజక వర్గానికే పరిమితమై కాలం గడుపుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారే తప్ప రాజకీయ పట్టు తప్పి కాదు అని అభిమానులు మరియు కార్యకర్తలు అంటున్నారు. ఆయన మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.  

ఒకప్పుడు రాష్ట్రాలలో  రాజకీయంగా రారాజుగా రాణించిన ఈయన ఇప్పుడు కనీసం విజయనగరంలో కూడా తన ప్రభావాన్ని చూపించలేక నిరాశ పడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వైయస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన బొత్స అనూహ్యంగా  వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న సమయంలో  2015 లో జగన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీనితో సీనియర్ అయిన బొత్సకు మంత్రి పదవి దక్కింది. అయితే ఇక్కడ ఆయనకు అనుకున్నంత సహకారం, ప్రాధాన్యం లభించడం లేదని సీఎం జగన్ తనకు తగిన ప్రోత్సాహం అందించడం లేదని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారట. ఎంత గట్టిగా ప్రయత్నించినా తన ప్రభావం విజయనగరం కూడా దాటడం లేదని ఈయన ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలానే కొనసాగితే తన ఇన్నాళ్ల రాజకీయ అనుభవం ఎందుకూ ఉపయోగపడదని భావించి ఇప్పుడు బిజెపిలోకి ఎంట్రీ ఇవ్వాలని బొత్స ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కమలనాథులతో హస్తం కలిపి తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని బొత్స యోచిస్తున్నట్లు త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయం జగన్ వరకు వెళుతుందా ? దీనిపై ఏ విధంగా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా రాబోయే మంత్రివర్గ విస్తరణలో పార్టీలో తన ప్రాధాన్యం మరింత తగ్గబోతోందని పసిగట్టిన ఈయన ఈ తరహా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: