ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలు కత్తిమీద సాములా మారాయి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మెలగకపోయినా, అధికారులకు అనుకూలంగా ఉండకపోయినా మొదటి వేటు వారిపైనే పడుతోంది. తాజాగా వ్యాక్సిన్లు వేయించుకోలేదన్న కారణంతో కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63మంది వార్డు వాలంటీర్లను తొలగించారు. ఇదెక్కడి అన్యాయమంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన కొత్తల్లో ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఫ్రంట్ లైన్ వారియర్లుగా పేర్కొంటూ వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలనుకుంది ప్రభుత్వం అయితే చాలామంది దీనిపట్ల విముఖత చూపారు. వ్యాక్సినేషన్ పై జరిగిన దుష్ప్రచారం కారణంగా ఉద్యోగులే వ్యాక్సినేషన్ కు వెనకడుగేశారు. ఆ దశలో ఉన్నతాధికారులతో వారందరికీ వార్నింగ్ లు వెళ్లాయి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిలు వేయించుకోవాలని, వేసుకోనివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సదరు డిపార్ట్ మెంట్ హెడ్ లు హెచ్చరించారు కూడా. అప్పటికీ కొంతమంది వివిధ రకాల కారణాలు చెప్పి వ్యాక్సినేషన్ కి దూరంగా ఉన్నారు.

భారత్ లో వ్యాక్సినేషన్ అనేది నిర్బంధం కాదు. అలాగని అందరూ వ్యాక్సిన్లకి దూరంగా ఉండటం కూడా సరికాదు. అలాంటి దశలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజల్లో అవగాహన పెంచి వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. పలు ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రభుత్వ సిబ్బంది టీకాలు ఇస్తున్న ఉదాహరణలు చూస్తున్నాం. అయితే కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాల్టీలో మాత్రం ఏకంగా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా 63మంది వాలంటీర్లపై వేటు పడటం విచిత్రం.

ఆత్మకూరులో ఈనెల 1న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సబ్ కలెక్టర్ జిలానీ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్లు వేయించుకోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఆయన హెచ్చరించారు. అయినా కూడా వారు స్పందించకపోవడంతో విధులనుంచి తొలగించాలంటూ కమిషనర్ కి సూచించారు. జేసీ సూచన మేరకు 63మంది వాలంటీర్లను విధులనుంచి తొలగించారు కమిషనర్. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని వాలంటీర్లు తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: