ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో మూడు నాలుగు నెలల్లో తన క్యాబినెట్ లో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ క్యాబినెట్ లో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఉన్న ఆశావహుల లిస్ట్ చాలానే ఉంది. ప్రతి జిల్లా నుంచి కనిష్టంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు అంటే పోటీ ఎలా ? ఉందో తెలుస్తోంది. టీడీపీ కంచుకోట అయిన‌ పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసిపి పై చేయి సాధించింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి క్లీన్ స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం టిడిపి కేవలం 2 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది.

ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తోపాటు తానేటి వనిత... సీనియర్ నేత చెరుకువాడ రంగనాథ రాజు మంత్రులుగా ఉన్నారు. అయితే జగన్ ప్రక్షాళనలో వీరు ముగ్గురిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారా ? లేదా రంగనాథరాజు , వ‌నిత‌ను తప్పిస్తారా అన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇక కొత్తగా మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉన్నారు.

వీరిలో క్ష‌త్రియ వ‌ర్గం కోటాలో ప్ర‌సాద‌రాజు వ‌స్తే... రంగ‌నాథ రాజు కేబినెట్ నుంచి అవుట్ అవ్వ‌క త‌ప్ప‌దు. ఇక ఎస్టీ వ‌ర్గం నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలో బాల‌రాజు మాత్ర‌మే సీనియ‌ర్‌. ఆయ‌న నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గ‌తంలో జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేయ‌డంతో పాటు జ‌గ‌న్ కోసం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి పార్టీలోకి వ‌చ్చారు. అంతే కాకుండా బాల‌రాజు ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ ఘ‌న‌విజయం సాధించారు. అందుకే బాల‌రాజుపై జ‌గ‌న్‌కు సానుకూల‌త ఉందంటున్నారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు కొత్త‌గా మంత్రులు అవుతార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: