సాధారణంగా జాతీయ పార్టీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆధిపత్యం పెద్దగా కొనసాగదనే చెప్పొచ్చు. పార్టీ అధిష్టానం చెప్పినట్లే అధ్యక్షులు నడుచుకోవాలి. సొంత నిర్ణయాలని తీసుకుని పార్టీని నడిపించడం సాధ్యం కాదు. కానీ గతంలో వైఎస్సార్ ఒక్కడే కాంగ్రెస్‌ని నడిపించారు. అధిష్టానానికి గౌరవం ఇస్తూనే, తన మాట మీద పార్టీ నడిచేలా చేసుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి అదే తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు.

కాంగ్రెస్‌లో మిగతా నాయకులు కంటే రేవంత్‌కే కాస్త క్రేజ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఈయన చెప్పినట్లే పార్టీలో నిర్ణయాలు జరగకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్నీ నియోజకవర్గాల్లో రేవంత్ చెప్పిన మాట నెగ్గదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో కూడా ప్రాంతాల వారీగా బలమైన నాయకులు ఉన్నారు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో రేవంత్ మాట చెల్లుబాటు అవుతుంది గానీ, అన్నీ నియోజకవర్గాల్లో అది సాధ్యం కాకపోవచ్చు.

ఉదాహరణకు కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరికి నల్గొండ పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాలపై పట్టు ఉంది. అక్కడ వారు చెప్పిన వారికే సీట్లు కూడా వస్తాయి. ఆ సీట్లలో కాంగ్రెస్‌ని గెలిపించుకునే కెపాసిటీ వారికి ఉందని చెప్పొచ్చు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు హుజూర్ నగర్, కోదాడ నియోజవర్గాలపై పట్టు ఉంది. అటు భట్టి విక్రమార్కకు ఖమ్మంలో ఫాలోయింగ్ ఉంది.

అలాగే శ్రీధర్ బాబు, గీతారెడ్డి, జగ్గారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌లో సొంత ఇమేజ్ ఉన్న నాయకులు ఎక్కువగానే ఉన్నారు. వారికి పట్టున్న నియోజకవర్గాల్లో రేవంత్ మాట చెల్లుబాటు కాదు. అయితే రానున్న రోజుల్లో రేవంత్ మరింత బలపడితే పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది. కానీ కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మరి రేవంత్‌కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్‌ని పూర్తిగా తన గ్రిప్‌లోకి తెచ్చుకోవడంలో రేవంత్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: