సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ పార్టీ పెట్టాలని సీఎం కావాలని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. అభిమానుల కోరిక మేరకు ర‌జనీ కూడా పలుసార్లు తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో సార్లు ప్రకటనలు చేసినప్పటికీ పార్టీ విషయంలో మాత్రం ముందడుగు వేయలేదు. ఇటీవల తమిళనాడు ఎన్నికల ముందు రజనీకాంత్ పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును, గుర్తులను ప్రకటించారు. దాంతో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు అయిందని అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయం లో రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. 

ఆయన బిపి లో హెచ్చుతగ్గులు ఉన్నాయన్న కారణంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం అనేక నాట‌కీయ‌ పరిణామాల మ‌ధ్య‌ తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని రజినీకాంత్ ప్రకటించడం సంచలనంగా మారింది. తన కూతురు త‌న ఆరోగ్యం ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో తాను రాజకీయాల్లోకి రావ‌డం లేద‌ని చెప్పారు. ఇకపై రాజకీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్పష్టం చేశారు. దాంతో ర‌జినీ నిర్ణ‌యం పై ఎన్నో విమర్శలు వచ్చాయి. బిపి అనేది సాధారణ సమస్య అని కాని రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవడానికి ఏవో కారణాలు ఉన్నాయని ప‌లువురు ఆరోపించారు. కానీ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాల వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా అలాంటి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దాంతో రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి ఇకపై వచ్చేది లేదని స్పష్టం చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో తన పార్టీ రజిని మక్కల్ మండ్రం ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నిర్వాహకులతో చెన్నైలో జరిగిన సమావేశం అనంతరం రజినీకాంత్ ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా మక్కల్  మండ్రం అనేది ఇప్పటినుండి తన అభిమాన సంఘం గా కొనసాగుతుందని చెప్పారు. దీని ద్వారా ఆర్ఎంఎం సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని రజినీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: