ఓటమి ఎరుగని నేతల జాబితాలో ఆమెకు కూడా స్థానం ఉంది. 2009లో మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. పార్టీ వీరవిధేయురాలిగా... అధినేతకు వీరాభిమానిలా ఉన్నప్పటికీ... ఆమె కల మాత్రం నెరవేరడం లేదు. ఆమె తర్వాత పార్టీలోకి  వచ్చిన వారు ఉన్నత పదవులు అలంకరిస్తుంటే... ఆమెకు మాత్రం కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కడం లేదు. ఎందుకని అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న
 
విశ్వసరాయి కళావతి... ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యే పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయ ప్రయాణంలో గెలుపు గుర్రంపై పరుగులు పెడుతున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కళావతి కల మాత్రం నెరవేరడం లేదు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన కళావతి... అన్ని అర్హతలున్నప్పటికీ... ఆమె చిరకాల కోరిక తీరక.. ఎంతో మదనపడుతున్నారు.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు విశ్వసరాయి కళావతి. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా గుర్తింపున్న పాలకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ పార్టీకి సరైన నేత కూడా లేకుండా కూడా కళావతి ప్లానింగ్ చేశారు. 1983 నుంచి ఐదు సార్లు పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 1989, 2009లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన కళావతి... 20 శాతం ఓట్లు సాధించారు. అయితే... ఆ తర్వాత పీఆర్‌పీకి రాజీనామా చేసిన కళావతి... జగన్‌కు మద్దతుగా నిలిచారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లల్లో కళావతి కూడా ఒకరు. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా 54 శాతం ఓటింగ్‌తో 17 వేల 980 ఓట్లతో సూపర్ విక్టరీ సాధించారు. అప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు... కళావతికి బెర్త్ కన్‌ఫామ్ అని. కానీ అలా జరగలేదు. ఎస్టీ నియోజకవర్గం, మహిళ, వెనుకబడిన జిల్లా, పార్టీలో తొలి నుంచి ఉంటున్న నేత... ఇలా ఎన్నో అర్హతలున్నప్పటికీ... కళావతికి పదవి మాత్రం దక్కడం లేదు.

తన తర్వాత పార్టీలో చేరిన తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి దక్కింది. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ లాంటి చాలా మంది కళావతి తర్వాతే పార్టీలో చేరినా... వారికి అమాత్యపదవులు దక్కాయి. కానీ కళావతి పరిస్థితికి మాత్రం ఆ యోగం రావటం లేదు. తొలిదశలో రాకపోయినా పర్లేదు... రెండున్నరేళ్ల తర్వాత మిగిలిన వారికి తప్పనిసరిగా పదవి దక్కుతుందని అప్పట్లో సీఎం వైఎస్‌ జగన్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎస్టీ కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెల్లం బాలరాజు పేరు బలంగా వినిపిస్తోంది. అటు నామినేటెడ్ పదవుల జాబితాలో కూడా కళావతి పేరు ఎక్కడా లేదు. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే మంత్రివర్గ విస్తరణపైనే కళావతి గంపెడాశలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: