వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇటీవల విజయసాయిరెడ్డి మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజుపై తరచూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లేఖ కూడా ఆయన్ను టార్గెట్ చేసుకునే రాశారు. నాలుగేళ్ల క్రితం జరిగిన హిరాఖుడ్ రైలు ప్రమాదంపై విచారణను అప్పుడు కేంద్ర మంత్రి హోదాలో అశోక్ గజపతి  తప్పుదారి పట్టించారని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.  


ఇంతకీ అసలేం జరిగిందంటే.. 2017 జనవరి 21వ తేదీ అర్థరాత్రి కునేరు రైల్వే స్టేషన్ యార్డు వద్ద హిరాఖుడ్ ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై అప్పట్లో జరిగిన విచారణను కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు తప్పుదోవ పట్టించారని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు తన ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంపై అత్యున్నతస్థాయి కమిటీ చేత సమగ్ర విచారణ జరిపించి, దోషులకు శిక్ష పడేలా చేయాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.


రైల్వే ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని అశోక్‌ గజపతి రాజు నక్సల్స్‌ పైకి నెట్టాలని చూశారని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సీబీసీఐడీ విచారణను కూడా నాటి డివిజినల్ రైల్వే మేనేజర్ తప్పుదారి పట్టించారని తన లేఖలో పేర్కొన్నారు. ఎన్ఐఏకు కూడా అశోక్ గజపతి తప్పుడు సమాచారం ఇచ్చారని విజయసాయి రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తన మనిషి అయిన బీవీవీ రాజు, వాల్తేరు ప్రొటోకాల్ ఆఫీసర్ సీహెచ్ విష్ణుమూర్తి ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి అశోక్‌గజపతి విచారణను మేనేజ్ చేయించారని విజయసాయి తెలిపారు.


ప్రమాదం జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామునే కొందరు కాంట్రాక్టు కార్మికులను తీసుకెళ్లి రైలు పట్టాల దగ్గర మార్పులు, చేర్పులు చేసి ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని అశోక్‌గజపతి చూశారని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు సైతం.. ఈ ప్రమాదానికీ, నక్సల్స్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని విజయసాయి అంటున్నారు. ఎన్ఐఏ నివేదికను విడుదల చేయాలని, లేదంటే ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టేలా అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: