ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఆధిక్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలోపేతం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కాస్త పట్టు దక్కినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. కృష్ణాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14 స్థానాల్లో గెలవగా, టీడీపీ కేవలం రెండే స్థానాలతో సరిపెట్టుకుంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉంటే టీడీపీ రెండు గెలుచుకోగా, వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది. అయితే ఊహించని విధంగా రెండు జిల్లాల్లో వైసీపీకి షాక్ ఇస్తూ, సగం నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందని విశ్లేషణలు వస్తున్నాయి.

కృష్ణాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల ఉండగా, అందులో ఒకరు వైసీపీకి వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీ బలం ఒకటికి చేరుకుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేల గెలిచిన చోట టీడీపీ నేతలు పుంజుకున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్, పెనమలూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పుంజుకుందని తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, వీరు  స్ట్రాంగ్‌గానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు టీడీపీ ఇన్‌చార్జ్‌లు పికప్ అయ్యారు. జిల్లాలో దెందులూరు, తణుకు, గోపాలాపురం, నిడదవోలు, ఉంగుటూరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు చిక్కిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికైతే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సగం నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చి బాగానే లైన్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: