విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం తప్పదని కొన్నాళ్ల క్రితం కేంద్రం తేల్చి చెప్పేసింది. కేవలం విశాఖ ఉక్కు మాత్రమే కాదని.. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను అన్నీ అమ్మేస్తున్నామని తన చర్యను  సమర్థించుకుంది. ఇలాంటి పరిశ్రమల అమ్మకం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాలని లక్ష్యం కూడా పెట్టుకుంది. కేంద్రం పట్టుదల ముందు.. విశాఖ ఉక్కు చరిత్రగానీ.. దీని ప్రత్యేకత కానీ.. ఏమీ నిలబడే పరిస్థితి లేదు.. ఆ విషయం వివరించినా అర్థం చేసుకుందామన్న ఆలోచనా కేంద్రానికి లేవు.


ఇందుకు రాజకీయ సమీకరణాలు కూడా కేంద్రానికి కలసి వస్తున్నాయి. అటు వైసీపీ గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు. అదే పరిస్థితి తెలుగు దేశానిది కూడా. ఇక మిగిలిందేమిటి.. విజ్ఞప్తులు, విన్నపాలు మాత్రమే.. ఇప్పుడు వైసీపీ అదే చేస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపండి అంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.


అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని... ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని... ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌ కే ఆభరణం వంటిదని విజయసాయిరెడ్డి వివరించారని చెబుతున్నారు. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని.. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారట.


అంతే కాదు.. ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారట. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని.. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వివరించారట. మరి ఇవన్నీ నిర్మలమ్మ పట్టించుకుంటారా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతారా.. అంటే.. పరిస్థితి ఆశాజనకంగా మాత్రం లేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: