ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ పర్యటనపై రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌ర్వత్రా ఉత్కంఠ‌ నెల‌కొంది. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన త‌ర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్న మ‌మ‌తా బెన‌ర్జీ ప్రతిప‌క్ష పార్టీల నేత‌లు అందరినీ క‌ల‌ువ‌నున్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఆమె భేటీ కానున్నారు. మ‌మ‌తా బెనర్జీ ఢిల్లీ టూర్‌కు ఒక‌రోజు ముందు ఆమెను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్లమెంట‌రీ పార్టీ చైర్‌ప‌ర్సన్‌గా ఎంపీలు ఎన్నుకున్నారు. దీని ద్వారా మమతా బెనర్జీ జాతీయ రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌న్న సంకేతాల‌ు ఇచ్చార‌ని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ ఇక త‌న దృష్టి అంతా ఢిల్లీపైనే అని స్వయంగా ప్రక‌టించారు. అయితే ఆమె జాతీయ రాజ‌కీయాల్లో ఎటువంటి పాత్ర పోషించ‌బోతున్నార‌న్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆదివారం ఢిల్లీలో కాలుపెడుతున్న మ‌మ‌త సోనియాగాంధీతో పాటు ప్రతిప‌క్ష పార్టీల నేత‌లంద‌రినీ క‌లువనున్నారు.

అయితే వామ‌ప‌క్షాల నేత‌ల‌ను మిన‌హా మిగ‌తా ప్రతిప‌క్షాల నేత‌లంద‌రినీ క‌లుసుకోనున్న మ‌మ‌తా బెన‌ర్జీ త‌న అంత‌రంగాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించ‌లేదు. 2024లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ ఓట‌మే మ‌మ‌తా బెన‌ర్జీ ల‌క్ష్యమ‌ని  చెబుతున్న ఆమె పార్టీ నేత‌లు.. ఆమెను కాబోయే ప్రధానిగా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు.  2014లో 31 శాతం ఓట్లతో, 2019లో 36శాతం ఓట్లతో మాత్రమే కేంద్రంలో అధికారాన్ని ద‌క్కించుకున్న భారతీయ జనతా పార్టీని గ‌ద్దె దించ‌డం అంత క‌ష్టమేమీ కాద‌న్నది ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వాద‌న‌.

ఇక ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ వాద‌న కూడా ఇదే. ప్రతిప‌క్షాల‌న్నీ ఏక‌మైతే బీజేపీ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టడం సుల‌భమేన‌ని చెబుతున్న ప్రశాంత్ కిషోర్ వాద‌న‌తో మ‌మ‌తా బెనర్జీ గొంతు కలిపారు. బెంగాల్‌లో త‌న గెలుపులో కీల‌క‌పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్‌ను ఢిల్లీకి పంపి ప్రతిప‌క్షాల‌ను ఏకం చేసే టార్గెట్‌ను మ‌మ‌త ఆయ‌న‌కు అప్పగించారట. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీల‌తో ప‌లుసార్లు భేటీ అయ్యారట. మరి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన జరిగే కలయికలు, సమావేశాలు మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: