దేశంలోని ప‌లు ప్రాంతాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా కేర‌ళ‌లో మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌వైపు మొగ్గుచూపిస్తోంది. వీకెండ్ లో సంపూర్న లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ఆంక్ష‌లు జులై 31, ఆగ‌స్టు 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

దేశంలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ  అత్యుత్తమ పనితీరు కనబరిచిచింది. వైరస్‌ కట్టడికి కేరళ తీసుకుంటున్నచర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా ప్ర‌శంసించింది. అయితే, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కేర‌ళ‌లో రోజు క‌నీసం 10వేలకుపైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగించినా ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ క‌రోనా పాజిటివ్ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే కొన్ని రోజుల క్రితం ఓకే రోజు దాదాపు 22వేల కేసులు వెలుగు చూడ‌డం ఆందోళ‌న క‌లిగించింది.

దీంతో.. కేర‌ళ‌లో కొవిడ్‌ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన‌ బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది. ‘కేరళలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌పై కేర‌ళ‌ ప్రభుత్వం చేస్తున్న‌ పోరులో ఈ బృందం సహకరించనుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
రెండోదశలో ఉగ్రరూపం దాల్చిన కొవిడ్ మ‌హ‌మ్మారి.. మే చివరి నుంచి అదుపులోకి రావడం ప్రారంభించింది.

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోక ముందే మరోవైపు మూడో ముప్పు తప్పదని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తూనే ఉంది.  ఇదే స‌మ‌యంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ‌గా  ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ గ‌తంలోనే ఆందోళన చెందింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో క‌రోనా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం ప్ర‌తి రోజు 10వేలకు పైగా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో కేర‌ళ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఆంక్ష‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: