పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇకపై రెండు నెలలకోసారి హస్తినకు వస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. సేవ్ డెమొక్రసీ.. సేవ్ కంట్రీ తన నినాదమని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యతపై పలువురు నేతలతో చర్చించామన్నారు. బీజేపీ గద్దె దించేదాకా ఖేలా హాట్ కొనసాగుతుందన్నారు.

ఐదు రోజుల క్రితం ఢిల్లీలో అడుగుపెట్టిన మమతా బెనర్జీ.. ప్రధాన మంత్రి మోడీని కలిశారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఆమె ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. దాదాపు 40నిమిషాల పాటు ఆయనతో పలు కీలక అంశాలు చర్చించారు. తమ రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులు, వరద పరిస్థితులు, తమ రాష్ట్రానికి రావాల్సిన సాయం తదితర అంశాలపై వివరంగా మాట్లాడారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుపై కూడా చర్చించారు. ఇక పెగాసస్ వ్యవహారంపై అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోడీని కోరారు.

2024ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానంగా దృష్టి సారించారు. ఎలాగైనా బీజేపీని అధికారం నుండి గద్దె దించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి కమలాన్ని కకావికలం చేసేందుకు పూనుకుంటున్నారు. అందులో భాగంగానే మమతా బెనర్జీ ఐదు రోజుల పర్యటన ఢిల్లీలో కొనసాగింది.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్న తృణమూల్ కాంగ్రెస్.. కాంగ్రెస్ లు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చేశాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కూడా మమతా బెనర్జీ కలిశారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ లీడర్ కమల్ నాథ్ తో పాటు ఆనంద్ శర్మలను కూడా కలిశారు. జాతీయ స్థాయిలో బేజీపీని దెబ్బకొట్టాలంటే కాంగ్రెస్ అవసరం ఎక్కువగా దీదీ భావిస్తోంది. త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కూడా ఆమె భేటీ కానున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: