మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా, తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌ రెడ్డి నియామకం ఈ రెండు ఎపిసోడ్‌ ల అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి అందరికీ తెల్సిందే. ఇక రేవంత్‌ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతోంది. అయితే... దీనిని పసిగట్టిన తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎలాగైనా.. కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. 

దీంతో... తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే... తాజాగా  బండి సంజయ్ తలపెట్టిన ఈ పాదయాత్ర వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆగస్టు 9నుంచి పాదయాత్ర చేయబోతునట్లు ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి... బీజేపీ పార్టీనే షాక్‌ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని విప్ జారీ చేసింది బీజేపీ పార్టీ. 

జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు ఏర్పాట్లు చేయనుంది తెలంగాణ బీజేపీ కార్యవర్గం.   మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.   సొంత నియోజకవర్గానికి కాకుండా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లకు మొదటగా వెళ్ళాలని కేంద్ర మంత్రులకు కాషాయ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అటు  ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి, విజయవాడ, భద్రాచలం పర్యటనకు సిద్ధమవుతున్నారు   కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  దీంతో బండి సంజయ్ పాదయాత్రపై మల్లగుల్లాలు పడుతోన్నారు పార్టీ నేతలు.  ఇక అటు అనారోగ్యం కారణంగా ఈటల రాజేందర్‌ పాదయాత్రకు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కాస్త కుదుట పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: