ఏపీలో లాక్ డౌన్ వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. మధ్యాహ్నం వరకే కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకే పర్మిషన్ ఇస్తున్నారు. మొత్తమ్మీద సెకండ్ వేవ్ ప్రారంభంలో ఎలా జరిగిందో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతోంది.

ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తోంది. రాత్రి 9గంటల వరకే షాపులు, 10 గంటల వరకు జన సంచారానికి అనుమతి ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా మరికొన్ని గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటోంది. గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. ఇక నెల్లూరు జిల్లాలో విడవలూరు, కావలి, వింజమూరు, పొదలకూరు వంటి ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ తోపాటు, ఆంక్షలు కఠినతరం చేశారు. మధ్యాహ్నం వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు.

సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోలేదా..? లేక థర్డ్ వేవ్ మొదలైందా అనే సంశయం ఉండగానే.. అనుకోకుండా లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి రావడం విశేషం. మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి రోజు రోజుకీ విషమంగా తయారవుతున్నట్టు తెలుస్తోంది. కేరళలో కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా శ్వాస సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. ఏపీలో అయితే కొన్ని జిల్లాల్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ అధికారులే చొరవ తీసుకుని నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. స్థానిక నాయకులతో చర్చించి కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నారు.

అన్ లాక్ వెసులుబాట్లు కల్పిస్తూ.. అందరూ మాస్క్ లు ధరించండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరం పాటించండి అని చెబుతున్నా.. ప్రయోజనం లేదని తేలిపోయింది. మాస్క్ పెట్టుకోనివారికి జరిమానా విధిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. దీంతో లాక్ డౌన్ తరహా ఆంక్షలే కరోనా కట్టడికి మేలు అని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: