వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జీడిపాకంలా సాగుతూనే ఉంది. అయితే ఇటీవల ఈ కేసు విషయంలో కొన్ని కీలక పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. ఈ కేసులో ఒక్కసారిగా కదలిక కనిపిస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఈ కేసు విచారణను సీబీఐ పులివెందుల కేంద్రంగా సాగిస్తోంది. అయితే అనూహ్యంగా ఈ కేసులో కీలక నిందితుడు అని పేరున్న సునీల్ యాదవ్‌ను సీబీఐ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి పులివెందులకు తీసుకొచ్చారు.


కడప జిల్లాలో విచారణ చేసిన తర్వాత సునీల్ కుమార్ యాదవ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి. అవేమిటంటే.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ పాత్ర పై ఆధారాలు లభించాయని పోలీసులు కోర్టుకు చెబుతున్నారు. సెక్షన్ 164 కింద వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చారని.. అందులో వివేకా హత్యలో సునిల్ ప్రమేయం గురించి ఉందని చెబుతున్నారు. అందుకే సునీల్ యాదవ్ ను సుదీర్ఘంగా విచారణ చేయాలని భావించామంటున్నారు పోలీసులు.


తాము విచారించాలను కుంటే సునీల్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని పారిపోయాడని.. ఈనెల 2న గోవాలో సునీల్ ను, ఆయన తండ్రి కృష్ణయ్య సమక్షంలో అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. గోవా కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారంట్ పై పులివెందుల కోర్టులో హాజరు పరుస్తున్నామని.. సునీల్ ను కస్టడీ కి తీసుకొని విచారించాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సునీల్ ను 13 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.


వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కుట్రకోణం వివరాలు బహిర్గతం చేయడం లేదంటున్న సీబీఐ పోలీసులు.. సీబీఐకు సునీల్ యాదవ్ సరిగ్గా సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సునీల్ యాదవ్ సహకరించడం లేదని.. ఇంకా ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.  హత్యకు వాడిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. సునీల్ యాదవ్ ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: