తమిళనాడు రాష్ట్రమంతా సాయంత్రం వరకే షాపులు, తెలంగాణలో అసలు ఎలాంటి ఆంక్షలు లేవు. ఏపీలో మాత్రమే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఆంక్షలు. ఓ జిల్లాలో మధ్యాహ్నం 2 వరకే షాపులు, మరో జిల్లాలో సాయంత్రం 6 తర్వాత ఆంక్షలు. ఇంకో ఊరిలో వీకెండ్ లాక్ డౌన్, మరో ఊరిలో ఉదయం 10గంటల వరకే పర్మిషన్. ఎక్కడికక్కడ అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది.

సెకండ్ వేవ్ ఉధృతం అయ్యాక ఏపీ అంతటా ఒకేలా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. నైట్ కర్ఫ్యూతో మొదలై, ఆ తర్వాత పగటి పూట కేవలం 2, 3 గంటలు వెసులుబాటు ఇచ్చారు. కేసుల్లో తగ్గుదల మొదలైన తర్వాత అన్ లాక్ సడలింపులు అమలులోకి వచ్చాయి. అయితే రాష్ట్రమంతటా ఒకేలాగా నిబంధనలు సడలించారు. కేసులు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో మాత్రం వారం రోజులపాటు అదనంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ప్రస్తుతం ఏపీలో కేసుల పెరుగుదల మరీ అంత ప్రమాదకరంగా లేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ లోకల్ లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. నెల్లూరు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఒకేరకంగా కర్ఫ్యూ అమలులో ఉండటంలేదు. ఒక్కోచోట ఒక్కోరకమైన నిబంధనలున్నాయి. డివిజన్ల వారీగా ఆర్డీవోలు స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నారు.

సినిమాహాళ్ల విషయంలో ఏపీ మొత్తం ఒకేరకమైన పరిస్థితులు లేవు. ఏపీలో చాలా చోట్ల సినిమాహాళ్లు తెరుచుకోలేదు. నైట్ కర్ఫ్యూ కారణంగా సెకండ్ షో లు లేవు, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ షో కూడా పడే అవకాశం లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఆంక్షలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాల విషయంలో కూడా ఈ లోకల్ నిబంధనలు అడ్డుపడుతున్నాయి. కరోనా కేసులు పెరిగిన చోట్ల నిబంధనలు కఠినతరం చేసి, మిగతా చోట్ల గేట్లు ఎత్తేస్తే.. అక్కడ కూడా కొవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్రం మొత్తం ఒకేరకమైన నిబంధనలు అమలులోకి తేవాలని భావిస్తున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: