ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ నిన్న మొన్నటి వరకూ ఓ ఐపీఎస్ అధికారి.. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యాడు. నల్గొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన తన తొలిసభలో తెలంగాణ కేసీఆర్‌ పాటు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు అంటే అర్థం చేసుకోవచ్చు.. కేసీఆర్ తెలంగాణ పాలకుడు కాబట్టి.. ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణ లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి  ఆమాత్రం విమర్శలు తప్పవు.


కానీ..తొలి సభలోనే ప్రవీణ్ కుమార్‌ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. తాను దళిత పిల్లల చదువుల కోసం పోరాడుతుంటే.. పక్క రాష్ట్రంలోని ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో తనపై తీవ్రమైన విమర్శలు చేశారని గుర్తు చేశారు. బడుగు వర్గాలు బాగు పడుతున్నాయంటే ఇలాంటి కుట్రలు మొదలవుతాయన్న ప్రవీణ్ కుమార్.. ఇలాంటి విమర్శలు చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బడుగు వర్గాలు ఇంకా బానిసత్వంలోనే ఉండాలా అంటూ ప్రశ్నించారు.


ఇంతకీ అసలు రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏమని ప్రస్తావించారంటారా.. ప్రవీణ్ కుమార్ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో హిందూ వ్యతిరేక భావజాలం వ్యాప్తి చేస్తున్నారని రఘరామ పార్లమెంటులో విమర్శించారు. ఇలాంటి అధికారులను కట్టడి చేయాలని సూచించారు. అంతేకాదు.. ప్రవీణ్ కుమార్‌ తో పాటు ఏపీ ఐపీఎస్‌ సునీల్‌ కుమార్ పై కూడా రఘురామ ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ ఇద్దరిపై రఘురామ హోంశాఖకు కూడా ఫిర్యాదులు చేశారు.


ఇలాంటి ఫిర్యాదులకు తాను బయపడేది లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్.. తను అడ్డుకుంటే వేలమంది ప్రవీణ్ కుమార్‌లుగా తయారవుతారని.. తనను కాపాడుకుంటారని అన్నారు. మొత్తానికి మొదటి స్పీచ్‌లోనే ప్రవీణ్‌ కుమార్‌ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. మరి ఈ విషయంపై రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

rsp