సైన్యం అంటే సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాసేది.. విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడేది.. సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తేనే దేశంలోపల ప్రజలు స్వేచ్ఛను అనుభవించేది. అయితే మన భారత సైన్యం కేవలం సరిహద్దుల్లో కాపలాకాయడమే కాదు.. ఆటల్లోనూ దేశం పరువు కాపాడుతోంది. అవును.. ఇప్పుడు భారత్‌ కు టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు వచ్చాయంటే.. అందులో సైన్యం పాత్ర కూడా ఉంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేక క్రీడల్లో సత్తా చాటిన వారిలో సైనికులు ఎందరో ఉన్నారు.


ఇలా సైనికుల్ని ఉత్తమ క్రీడాకారులుగా మలిచేందుకు సైన్యం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వర్ణం సాధించి 120 ఏళ్ల చరిత్రను తిరగరాసిన నీరజ్‌ చోప్రా కూడా ఓ సైనికుడే అన్న సంగతి తెలిసిందే. భారత సైన్యంలో సుబేదార్‌గా పని చేస్తున్న యువ కెరటం నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి దేశం పరువు నిలిపాడు.. ఎక్కడో పతకాల పట్టికలో 60ల్లో ఉన్న భారత స్థానాన్ని 48కి ఎగబాకించాడు.. ఇలాంటి సైనికులను సైన్యం ప్రోత్సహిస్తోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందిస్తోంది.


సైనికుల్లో ఆటల పట్ల ఆసక్తి ఉన్న వారిని గుర్తించి.. వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో కోచింగ్ ఇప్పిస్తోంది భారత సైన్యం. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, వెయిల్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, రోయింగ్‌, సెయిలింగ్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌పై అంశాలపై సైన్యం దృష్టి సారించింది. ఈసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అమిత్‌ పంగల్, మనీశ్‌ కౌశిక్ కూడా సైనికులే. సతీశ్‌ కుమార్‌, అథ్లెట్‌ అవినాశ్‌ సబ్లే కూడా సైన్యం నుంచి వచ్చిన వారే. పతకాల సాధన ద్వారా 135 కోట్ల భారతీయుల ప్రశంసలందుకుంటోంది భారత సైన్యం.


నీరజ్‌ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ఇంటర్నేషనల్ రేంజ్‌లో కోచింగ్ ఇచ్చేందుకు మిషన్‌ ఒలింపిక్స్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సైన్యం నిర్వహిస్తోంది. 2001 నుంచే సైన్యంలోని యువ క్రీడాకారుల్ని ప్రోత్సాహిస్తోంది. దాని ఫలితాలు ఇప్పుడు పతకాల రూపంలో కనిపిస్తున్నాయి. పుణెలో 200 మంది ఆటగాళ్లకు శిక్షణనిచ్చేలా ఓ భారీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఉంది. మీరట్‌లో 200 ఎకరాల్లో ఈక్వెస్ట్రియాన్‌ మైదానం ఏర్పాటు చేసింది. ముంబయిలోని ఆర్మీ యాచింగ్‌ నోడ్‌లో సెయిలింగ్‌లో ట్రైనింగ్ ఇస్తోంది. భారత సైన్యమా.. నీకు మరోసారి జేజేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: