చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం... ఇక ఈ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు పేరే. ఎందుకంటే ఇది ఆయన అడ్డా. వరుసగా కుప్పంలో అధినేత చంద్రబాబు తిరుగులేని విజయాలు సాధిస్తున్నారు. అయితే చంద్రబాబుకు చెక్ పెట్టాలని ప్రత్యర్ధులు అనేకసార్లు ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా వైఎస్సార్, కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు.

ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ సైతం అదే బాటలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్‌గా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టాలని బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. కానీ అక్కడ వైసీపీ ఎలా గెలిచిందో కుప్పం ప్రజలని అడిగితే చెప్పేస్తారు. అధికార బలాన్ని అడ్డగోలుగా ఉపయోగించి గెలిచారనే సంగతి తెలిసిందే.  

ఇక ఆ విజయాలని చూసుకుని వైసీపీ నేతలు బాగా హడావిడి చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని అంటున్నారు. తాజాగా మంత్రి నారాయణస్వామి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. బాబుకు డిపాజిట్లు రావని మాట్లాడుతున్న నారాయణస్వామి వచ్చే ఎన్నికల్లో, తన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో ఓటమిని పలకరించబోతున్నారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

కుప్పంలో ఎంత రాజకీయం చేసిన బాబుని ఓడించడం కష్టమని, జగన్ వచ్చి నిలబడి, వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబుని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. తమ సొంత సామాజికవర్గం ఓట్లు పులివెందులలో 50 శాతంపైనే ఉండటంతో జగన్, అక్కడ గెలుస్తున్నారని, కానీ కుప్పంలో 5 శాతం కూడా చంద్రబాబు సొంత సామాజికవర్గం ఓట్లు లేవని, అయినా సరే గత ఏడు పర్యాయాలు ఇక్కడ బాబుని ఆదరిస్తూనే ఉన్నారని చెబుతున్నారు. భవిష్యత్‌లో కూడా కుప్పంలో బాబుని ఓడించడం వైసీపీ వల్ల కాదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: