హుజూర్ నగర్... హుజురాబాద్... రెండు పేర్లు దగ్గరగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ రెండు పేర్లు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఒకటి ఉమ్మడి నల్లగొండ జిల్లా అయితే.. మరోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అయినా సరే... ఒకదానికొకటి లింక్ గానే ఉన్నాయి ప్రస్తుతం. ఇందుకు ప్రధాన కారణం ఉప ఎన్నికలే. మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఇక రంగంలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్... ప్రచారం కూడా ప్రారంభించారు. ఇదంతా నాణానికి ఒక వైపు.

మరోవైపు చూస్తే.. ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గం గురించి అందరూ జోరుగా చర్చించుకుంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి నాటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నల్లమడ ఉత్తమ్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో... అసెంబ్లీకి వెళ్లేందుకు ఇష్టం చూపని కెప్టెన్ ఉత్తమ్... ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ... శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో... ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు.

అయితే ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల గురించే అంతా చర్చించుకుంటున్నారు. రెవెన్యూ డివిజన్ గా చేస్తానని చేసిన ప్రకటన మాత్రమే అమలైంది. ఆ తర్వాత మిగిలినవి ఏవీ కూడా అమలు కాలేదు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పైగా నియోజకవర్గంలో ఉండాల్సిన ఎమ్మెల్యే పూర్తిగా హైదారాబాద్ కే పరిమితమయ్యారు. ఇక హుజూర్ నగర్ బాధ్యతల నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తప్పించడంతో... ఆయన హుజూర్ నగర్ వైపు తలెత్తి కూడా చూడటం లేదు. మరోవైపు టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉండి.. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. హామీలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక్కడ అమలు కానీ హామీలు.. హుజురాబాద్ లో అమలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కెప్టెన్ ఉత్తమ్. ఇదే విషయాన్ని హుజురాబాద్ లో కూడా ప్రచారం చేస్తామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: