ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బెంగాల్ కోటలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రయత్నించింది. బెంగాల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం... అక్కడ కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది కూడా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు బీజేపీ అగ్రనేతలు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఓ పది వరకు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అటు కేంద్ర మంత్రులైతే అక్కడే తిష్ట వేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకునేందుకు అన్ని దార్లను వాడేశారు. ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశారు. పార్టీలో సెకండ్ ప్లేస్ లో ఉన్న నేతలందరికీ కాషాయ కండువా కంపేశారు. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతున్నా కూడా... కేంద్రం మాత్రం బెంగాల్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దీదీ హ్యాట్రిక్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.

అయితే గతంలో ఎన్నడూ లేనతంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అటు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందల మంది గాయపడ్డారు. పలు చోట్ల బాంబు దాడులు... పోలింగ్ బూతులపై దాడులు, నేతలపై దాడులు జరిగాయి. అయితే శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా అదే స్థాయిలో హింస చెలరేగింది. ఏకంగా కేంద్ర మంత్రులు పర్యటించేందుకు వస్తే... రాళ్ల దాడి జరిగింది. హింసాత్మక ఘటనలను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా ఖండించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా బెంగాల్ లో పర్యటించి... కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఘటనలను తీవ్రంగా పరిగణించిన కోల్ కతా హైకోర్టు...  హింసాత్మక ఘటనలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సిట్ టీమ్ లో బెంగాల్ సీనియర్ అధికారులు ఉంటారని కూడా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలను బెంగాల్ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గియా స్వాగతించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: