వైసీపీలో ఆడియో లీక్ లు ఎప్పుడు వెలుగు చూసినా, వెంటనే సినీ నటుడు పృథ్వీ అందరికీ గుర్తొస్తారు. అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు పృథ్వీపై ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా ఓ మహిళతో సన్నిహితంగా మాట్లాడినట్టు ఆడియో లీకైంది. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరగడంతో పృథ్వీ తనకు తానుగా ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పెద్దలు చెప్పడం వల్లే తాను పార్టీపై గౌరవంతో పదవినుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆరోపణలే ఎమ్మెల్యే అంబటి, మంత్రి అవంతి శ్రీనివాస్ పై వచ్చాయి. కానీ ఇక్కడ ఆ స్థాయిలో రియాక్షన్ లేదు. ఎమ్మెల్యే, మంత్రి గురించి పార్టీలో ఎవరూ నోరు మెదపలేదు. ఎవరికి వారు తమ సొంత వివరణ ఇచ్చుకున్నారు, ఆ గొంతులు తమవి కావన్నారు.

గతంలో పృథ్వీ కూడా ఆడియోలో వినిపించిన గొంతు తనది కాదని వివరణ ఇచ్చారు. విచారణ చేపట్టాలన్నారు, తనపై కుట్ర జరిగిందని, తనను ఇరికించారని అన్నారు. కానీ పార్టీ పెద్దలు కూడా ఆ మాటలు నమ్మలేదు. ఆయన్ను పక్కకు తప్పించారు, పార్టీకి అంటిన మరకను కడిగేసుకున్నారు. మరిప్పుడు అంబటి, అవంతి విషయంలో పార్టీ  ఏంచేస్తోంది. కనీసం విచారణకు ఆదేశించిందా..? లేదా వారిని వ్యక్తిగతంగా వివరణ అడిగిందా..?

సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లకు మూలాలు రాబట్టడం పోలీసులకు పెద్ద పనేం కాదు. మరి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ విషయంలో ఆ పోస్ట్ లు పెట్టినవారిని కనిపెట్టారా లేదా అనేది తేలలేదు. గతంలోనే అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మరి ఆయన కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తేలాలి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా తనపై కుట్ర జరిగిందంటున్నారు కానీ, ఎవరు చేసి ఉంటారో చెప్పలేకపోతున్నారు.

వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న అంబటికి ఆడియో వ్యవహారం తలనొప్పిగా మారింది. అటు అవంతి మంత్రి పోస్ట్ లో ఉన్నా, దాన్ని కొనసాగించుకునే క్రమంలో ఇలాంటి ఆడియో విడుదల కావడంతో ఆయన కూడా తల పట్టుకున్నారు. ఆరోపణలు వచ్చీ రాగానే పృథ్వీని సాగనంపిన పార్టీ.. ఎమ్మెల్యే, ఎంపీపై మాత్రం సాఫ్ట్ కార్నర్ తో ఉందనే విషయం అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: