గుంటూరులో వైసీపీ నేతల అత్యుత్సాహం, పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ వెరసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మైలేజీ పెంచిందన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జోరుగా జరుగుతోంది. అలాగే అధికార వైసీపీ నాయకుల్లో కూడా తొందరపడ్డామనే టాక్‌ వినిపిస్తోంది. గుంటూరులో ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహం సందర్శన, కుటుంబ సభ్యుల ఓదార్పులు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధాన్ని తలపించింది. జీజీహెచ్‌ వద్ద రమ్యశ్రీ మృతదేహాన్ని పరామర్శించేందుకు వచ్చిన అధికార పార్టీ నేతలను అడ్డుకోవడం, పరమాయకుంటలోని ఆమె ఇంటికి వెళ్లి లోకేశ్‌ పరామర్శిస్తున్న సమయంలో అధికార పార్టీ నేతలు అక్కడకు చేరుకుని హడావుడిగా చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక నేత, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పోలీస్ కాన్వాయ్‌తో ఆ ప్రాంతానికి చేరుకోవడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఇలా రమ్య ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో లోకేశ్‌ సహా నేతలందరినీ పోలీసులు అరెస్ట్‌ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. వారందరినీ రాత్రి 7 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచి నోటీసు ఇచ్చి పంపారు. ముఖ్యంగా లోకేశ్‌ను తొలుత పత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో.. అక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకుని రోడ్డుపై ఆందోళనకు దిగారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచిన లోకేశ్‌ను తర్వాత గంటపాటు పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు వైపు తిప్పారు. చివరకు రాత్రి 7 గంటల తర్వాత పెదకాకాని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో నోటీస్‌ ఇచ్చి విడుదల చేశారు. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వరుస సంఘటనలపై మీడియాలో కథనాలు, కవరేజ్‌లు లోకేశ్‌కు, ఆ పార్టీకి మంచి మైలేజీని తెచ్చి పెట్టాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో గుంటూరు వైసీపీలో నాయకుల్లో తొందరపడ్డామనే భావన వ్యక్తమవుతోంది. నగరానికి చెందిన ఓ నేత అత్యుత్సాహం వల్లే టీడీపీకి కలిసి వచ్చేలా చేసిందని పార్టీ క్యాడర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: