మళ్లీ లాక్ డౌన్ తప్పదా... ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న. ఏమో తప్పదేమో అని కొందరంటుంటే... అబ్బే అంత సీన్ లేదంటున్నారు మరి కొందరు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం లాక్ డౌన్ తప్పదేమో అని అనిపిస్తోంది. కరోనా వైరస్... ప్రపంచం మొత్తం ఓ కుదుపు కుదిపేసిన వైరస్. కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది కూడా. అయితే ప్రస్తుతం కొవిడ్ వైరస్ ను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనుక్కున్నారు. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లను వివిధ దేశాలు ప్రజలకు అందిస్తున్నాయి కూడా. భారత దేశంలో కూడా ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో 60 కోట్ల వ్యాక్సిన డోసులను వైద్యులు అందించారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా వచ్చాయి. అటు మరణాలు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఏడాది మే నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో... అన్ లాక్ నిబంధనలు నడుస్తున్నాయి. తెలంగాణలో పూర్తిస్థాయిలో అన్ లాక్ చేయగా... ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూనే ఉన్నారు. అటు థర్డ్ వేవ్ పై ఇంకా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో థర్డ్ వేవ్ తప్పదంటూ శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  అటు దేశ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి కూడా. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 16వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణలో కూడా విద్యా సంస్థలు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే కేరళలో ప్రతి రోజు 30 వేలకు పైగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అటు ఏపీలో కూడా ప్రతి రోజు 15 వందల మంది వరకు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. వైరస్ కట్టడికి కేరళ ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తోంది. ప్రతి ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించింది. అటు ఏపీలో కూడా ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలవుతోంది కూడా. పరిస్థితి ఇలాగే కొనసాగితే... మళ్లీ లాక్ డౌన్ తప్పదంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: