ఏపీలో రాజకీయాలు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా నడుస్తుంటే, చిత్తూరు జిల్లాలో మాత్రం చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రబాబు, పెద్దిరెడ్డిల సొంత జిల్లా అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడ టి‌డి‌పికి ఎక్కువ పట్టు ఉండాలి. కానీ పెద్దిరెడ్డి ఎఫెక్ట్‌తో జిల్లాలో వైసీపీ హవా ఎక్కువగా ఉంది.

జిల్లాలో పలు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా పట్టు ఉంది. అందుకే గత ఎన్నికల్లో చిత్తూరులో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది. ఇక టి‌డి‌పి కేవలం ఒక సీటు గెలవగా, అది కూడా కుప్పంలో చంద్రబాబు గెలిచారు. అయితే అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైసీపీ వశం చేసేయాలని పెద్దిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కుప్పంలో టి‌డి‌పి క్యాడర్‌ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్ ఇస్తూ, దాదాపు 90 శాతం పంచాయితీలు వైసీపీ కైవసం చేసుకునేలా చేశారు. ఇలా కుప్పంపై పట్టు సాధిస్తున్న పెద్దిరెడ్డి, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టేయాలని చూస్తున్నారు.

అందుకే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. పెద్దిరెడ్డిపై రివర్స్ ఎటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. తన సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే కాక, పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో టి‌డి‌పి జెండా ఎగిరేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ టి‌డి‌పి ఇంచార్జ్‌ని మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బంధువు అనీషా రెడ్డి పోటీ చేశారు. ఆమె పెద్దిరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు.


ఈ క్రమంలోనే ఆమెని పక్కనబెట్టి చల్లా రామచంద్రారెడ్డికి ఇంఛార్జ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రతిరోజూ పుంగనూరులో పార్టీ కార్యక్రమాలు జరిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలాగైనా పెద్దిరెడ్డికి చెక్ పెట్టలాని చంద్రబాబు చూస్తున్నారు. కానీ బలంగా ఉన్న పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం అంత సులువు కాదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: