మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి. పేరుకే ప్రగతి రథ చక్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ... చివరికి ఆ చక్రాలే ఊడిపోయే పరిస్థితి దిగజారింది. ఓ వైపు కరోనా వల్ల పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ.. ప్రస్తుతం పాత బస్సులతో కుదేలవుతోంది. ఇప్పటికే చాలా డిపోల్లో కాలం చెల్లిన బస్సులు తిరుగుతుున్నాయి. కొత్తవి కొనాలంటే... ప్రస్తుతం ఆర్టీసీకి భారంతో కూడిన వ్యవహారం. కనీసం కొత్త బస్సు కాదు కదా... విడి భాగాలు కూడా కొనే పరిస్థితి లేదు. కరోనా కారణంగా గతేడాది దాదాపు రెండు నెలల పాటు బస్సులన్నీ పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కూడా సర్వీసులు పెద్దగా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం తిరుగుతున్న సర్వీసులు కూడా కేవలం 50 శాతం ఆక్సుపెన్సీతో నడుస్తున్నాయి. దీనికి తోడు డీజిల్ ధర కూడా సెంచరీకి చేరువైంది. ఇది అదనపు భారం. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న ఏకైక ఆదాయం కార్గొ ద్వారా మాత్రమే.

అటు ఆదాయం తగ్గిపోవడంతో... కొత్త బస్సులు, విడి భాగాలను కొనుగోలు చేయడం లేదు ఆర్టీసీ అధికారులు. ఇదే సమయంలో పాత బస్సులకే మరమ్మతులు చేసి తిప్పేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భారీ వర్షాలకు దాదాపు అన్ని రోడ్లు కూడా గుంతల మయంగా తయారయ్యాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి దారుణం. మోకాలి లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఏజెన్సీ రోడ్ల పరిస్థితి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీసం కాలి బాట కూడా లేకుండా కొట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామీణ సర్వీసులుగా తిరుగుతున్న బస్సులు ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియటం లేదు. ఏ బస్సు ఏ ప్రమాదానికి గురవుతుందో అని... అధికారులు భయపడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. ఇక గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న బస్సులు అదుపు తప్పి పంట కాలువలోకి కూడా దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్క బస్సు ప్రమాదానికి గురైనా సరే... అది సంస్థకు చెడ్డపేరు తెస్తుంది. ఆటు గతుకుల రోడ్లు, ఇటు కాలం చెల్లిన బస్సులతో డ్రైవర్లు నానా పాట్లు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: