దుర్గగుడిలో మరో వివాదం రాజుకుందా...ఈవో వర్సెస్ పాలకమండలి సభ్యుల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయా.. ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పాలకమండలి ఆరోపిస్తుంటే నా పరిధిలోనివి మాత్రమే చేస్తున్నానంటూ ఈవో చెపుతున్న వైఖరిపై దుర్గగుడి పాలకమండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అసలు ఇంతకీ దుర్గగుడిలో ఏం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన దుర్గగుడి లో రేగుతున్న వివాదాలకు కారణాలేంటి.

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మ.. నిత్యం అమ్మవారిని వేలల్లో భక్తులు దర్శించుకుంటారు.  భక్తుల సౌకర్యాలు రీత్యా ఇంద్ర కీలాద్రి  పై అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాంతో పాటు క్యూలైన్లలో స్వల్ప మార్పులు చేపట్టారు. కాని ఇవేవీ చైర్మన్ పైలా సోమినాయుడు కు చెప్పకుండా చేస్తూ కొండపైన ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ఈవో భ్రమరాంబ సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటారని కొండపైన ఉద్యోగుల్లో అభిప్రాయం. పాలకమండలి సభ్యులు కూడా అభివృద్ధి పనులు, క్యూలైన్లలో మార్పులు ఇతరత్రా చిన్న వాటిని చెప్పకుండా చేసేస్తున్నా లైట్ తీసుకున్నారట. కాని దుర్గగుడిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ను చైర్మన్ కు చెప్పకుండానే ఈవో బయటకు లీక్ చేయడంపై చైర్మన్ పైలా సోమినాయుడు ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారట.అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీవరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనుండడంతో దీనికి సంబంధించిన పోస్టర్ ను మీడియా సమావేశం నిర్వహించి చైర్మన్ సమక్షంలో ప్రకటించడం సాంప్రదాయం.కాని ఈవో నేరుగా బయటకు లీక్ చేయడంపై చైర్మన్ తో పాటు పాలకమండలి సభ్యులు ఈవో వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారట. అదేవిధంగా దసరా పనుల్లోనూ తమకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయంపైనా దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈవో, పాలకమండలి మధ్య విభేధాలు తలెత్తడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  గతంలో  ఇదే మాదిరి వివాదాలు నెలకొన్న సమయంలో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారింది.  ప్రస్తుతం తాజా వివాదాలతోనూ మరోసారి వివాదాలు ముదరుకుండా ఉన్నతాధికారులు, దేవాదాయశాఖ మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.   చూడాలి దసరా ఉత్సవాల లోపు వీరి మధ్యనున్న విభేధాలు తొలగిపోతాయా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: