పశ్చిమ బెంగాల్‌లో ఏ చిన్న విషయం అయినా సరే... ఇప్పుడు జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి మధ్య నిప్పు నెయ్యి మాదిరి పరిస్థితి తయారైంది. ఏ చిన్న అవకాశం దక్కినా కూడా... ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బీజేపీ నేతలు రెడీగా ఉన్నారు. అలాగే బీజేపీ పెద్దల తీరును కూడా ఎండగట్టేందుకు స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగేందుకు కూడా వెనుకాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన రాజకీయ రగడ... ఎన్నికలు పూర్తైనా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ దాడి జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కూడా మారింది.

తాజాగా కోల్‌కతాలోని ఓ ఫ్లై ఓవర్ తృణమూల్‌ కాంగ్రెస్‌... బీజేపీ మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. అది కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం కాదు... కేవలం ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చిన ఒక యాడ్ మాత్రమే. కోల్‌కతాలోని ఓ ఫ్లై ఓవర్‌ను ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం నిర్మించినట్లు యాడ్‌ ఇచ్చారు. ఇది బీజేపీ నేతలే చేశారని ఇప్పుడు టీఎంసీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో యోగి సర్కార్‌పై కూడా  ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది టీఎంసీ సర్కార్. అసలు కోల్‌కతాలో ఫై ఓవర్‌ను యోగి సర్కార్‌ తమ ప్రభుత్వ బ్రిడ్జ్‌గా ఎలా చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో లాభం కోసం యోగి సర్కార్ చేయని పనులను కూడా చేసినట్లు చూపిస్తోందని సోషల్‌ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు టీఎంసీ నేతలు. పశ్చిమ బెంగాల్‌ ప్రజల కోసం మౌలిక వసతులను టీఎంసీ ఏర్పాటు చేస్తుంటే... బీజేపీ నేతలు ఎలా దొంగిలించుకుంటున్నారో చూడండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

మమతా సర్కార్‌ నిర్మిస్తుంటే... యోగి సర్కార్‌ ప్రచారం చేసుకుంటోందని.... ఇదే సొమ్ము ఒకడిది... సోకు ఒకడిదిలా ఉందని తృణమూల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. దేశ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. అయితే ఈ వివాదంపై బీజేపీ నేతలు ఏ మాత్రం స్పందించలేదు. కానీ యాడ్ పబ్లిష్ చేసిన పేపర్ యాజమాన్యం మాత్రం బదులిచ్చింది. యాడ్‌లో ఇమేజ్‌ తప్పుగా ప్రింట్‌ అయ్యిందని... అన్నీ డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ ఇమేజ్‌ తీసివేసినట్లు ప్రకటించింది. తప్పుడు ఫోటో ప్రచురితం అయినట్‌లు యూపీ ప్రభుత్వం - న్యూస్‌ మార్కెటింగ్ విభాగం కూడా ప్రకటన జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: