నిర్మల్ సభ విజయవంతం కావడంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో  అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోన్న బీజేపీకి అమిత్ షా కొండంత భరోసా ఇచ్చారని కమలనాథులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తోంటే.. వారం పాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్.. ప్రధాని మోదీ, అమిత్ షాను కలవటం ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టారు. దీంతో అప్రమత్తమైన అయిన బీజేపీ.. దిద్దుబాటు చర్యలకు దిగింది. అమిత్ షాను రంగంలోకి దింపింది. నిర్మల్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది.దీంతో అమిత్‌షా సభ రాజకీయ చర్చకు తెరతీసింది. టీఆర్ఎస్‌తో టీఆర్‌ఎస్‌కు దోస్తానా లేదనీ, రాజకీయ పోరాటం కొనసాగుతోందన్న  భరోసాను అమిత్ షా తన ప్రసంగంలో‌ ఇచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ కిందిస్థాయి నేతలు, క్యాడర్‌లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా అమిత్ షా ప్రసంగం కొనసాగిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం టీఆర్ఎస్‌తో పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటోంది.‌

తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయంగా హోరాహోరీ నడుస్తోన్న సమయంలో కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ వరుసగా భేటీలు కావడం.. హుజూరాబాద్ ఉపఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటంతో తెలంగాణ బీజేపీ నేతలు టెన్షన్ పడ్డారు.బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య దోస్తానా ఉందన్న ప్రచారం కూడా కాషాయ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టింది. టీఆర్ఎస్‌తో తెలంగాణ బీజేపీ గట్టిగా పోరాడుతున్నా..‌ ఢిల్లీలో ఆ పార్టీ నేతలు కేసీఆర్‌తో స్నేహంగా ఉండటం..రాష్ట్ర పథకాలను  కేంద్రమంత్రులు ప్రశంసించటం లాంటివి తెలంగాణ కమలనాథులకు మింగుడు పడలేదు. గతవారం హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా సైతం.. ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రిని కలవడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ బీజేపీ నేతలు పడుతున్న ఆందోళన విషయం  బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లిందట.. ఇందులో భాగంగానే నిర్మల్ వేదికగా  బీజేపీ నేతలు, కార్యకర్తలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది.

పాదయాత్ర చేస్తోన్న బండి సంజయ్,  మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల కష్టాలను తీర్చడానికే సంగ్రామ యాత్ర చేస్తోన్న బండిని ఆశీర్వదించాలని కోరారు. ఈటల రాజేందర్‌ను సైతం ఫైటర్‌గా అభివర్ణించారు. దీంతో బండి సంజయ్, ఈటలకు హైకమాండ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. మరోవైపు హుజురాబాద్  ఉప ఎన్నిక త్వరలో జరగనుందన్న చర్చకు నిర్మల్ సభ తెర తీసింది.  హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవటానికి కావాల్సినంత నైతిక మద్దతు లభించిందని కమలనాథులు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని విమర్శలు చేస్తోన్న  కాంగ్రెస్‌కు అమిత్ షా చెక్ పెట్టారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: