కుప్పం నియోజకవర్గం..ఈ పేరు చెబితే గుర్తొచ్చేది చంద్రబాబే...1989 నుంచి కుప్పంలో చంద్రబాబు సత్తా చాటుతూ వస్తున్నారు. అంతకముందు రెండుసార్లు అంటే 1983, 1985లో ఇక్కడ టి‌డి‌పి జెండానే ఎగిరింది. ఇక 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు. అనేక మంది ప్రత్యర్ధులు బాబుకు చెక్ పెట్టాలని చూశారు గానీ...అది సాధ్యం కాలేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక...కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

కుప్పంలో వైసీపీకి లీడ్ తీసుకొచ్చే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. ఇక ఆయన తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కుప్పంలో తొలిసారి బాబుకు భారీ షాకులు తగిలేలా చేశారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తా చాటింది. దాదాపు 90 శాతం పంచాయితీలని కైవసం చేసుకుంది. తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ హవా స్పష్టంగా కొనసాగింది.

కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైసీపీ 17, టీడీపీ 2, గుడిపల్లె మండలంలో 12కి 12 ఎంపీటీసీలు, రామకుప్పం మండలంలో 16కి గాను 16, శాంతిపురం మండలంలో 18కిగాను 11 ఎంపీటీసీలు వైసీపీ గెలుచుకుంది. అంటే దాదాపు కుప్పంలో వైసీపీ ఆధిక్యం నడిచింది. దీంతో చంద్రబాబుకు కుప్పంలో భారీ షాకులు తగిలాయని వార్తలు వచ్చేస్తున్నాయి. ఇక కుప్పంలో బాబు పని అయిపోయిందని, నెక్స్ట్ ఇక్కడ బాబు ఓటమి ఖాయమని వైసీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నాయి.

మరి వైసీపీ చెప్పినట్లుగానే నెక్స్ట్ కుప్పంలో బాబు ఓడిపోతారా? అంటే అది వైసీపీ అవివేకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కుప్పంలో ఆధిక్యం తెచ్చుకున్నారు...అలాగే ఆ ఆధిక్యం ఎలా వచ్చిందో కుప్పం ప్రజలని క్లియర్‌గా అడిగితే అర్ధమవుతుందని, అలా అని వైసీపీ గెలుపుని తక్కువ చేయడానికి లేదని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు గెలిచామని, సాధారణ ఎన్నికల్లో బాబు ఓడిపోతారని అనుకోవడం అవివేకమే అవుతుందని, కుప్పంలో అంత తేలికగా బాబుని ఓడించడం కష్టమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: