పంజాబ్ లో అత్యధిక జనాభా కలిగిన దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చరణ్ జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నియమించింది. ఆ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 32 శాతం ఉంది. కాంగ్రెస్ నిర్ణయంతో జరగబోయే పరిణామాలను అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టేలా ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఆయన తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయేవారి విషయంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొన్న కాంగ్రెస్.. చన్నీని ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్షాలను ఆశ్చర్యపోయేలా చేసింది. పంజాబ్ లో దళితులు స్వాతంత్ర్య పోరాటంలో వీరోచితంగా పోరాడారు. అయినా 74 ఏండ్లుగా దళితుల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. అక్కడ అద్ ధర్మ్ ఉద్యమంతో 1932 నుంచే దళితులు గుర్తింపు కోసం పోరాడారు. అయినా హిందూ అగ్రవర్ణ కులాలు, సిక్కు ఆధిపత్య వర్గాలు(జాట్ సిక్కులు), వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. దళితులకు మాత్రం ఆ పదవి దక్కలేదు. 

ఇన్నేండ్ల తరువాత ముఖ్యమంత్రి పదవి రావడంతో దళితులు సంబరాలు చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే దళితుడినే ఉప ముఖ్యమంత్రి చేస్తామని అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం ఆ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతో జతకట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా దళితుడినే ముఖ్యమంత్రి చేయడంతో అకాలీదళ్ కొత్త మార్గంలో పడింది. పంజాబ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి సవాల్ నే ఎదుర్కుంటోంది. పంజాబ్ లో దళితుల ఓట్లు గంపగుత్తగా ఒకేవైపు పడవు. అక్కడ దళితులు వర్గాలుగా చీలిపోయి ఉంటారు. ప్రధానంగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన దళితులు ఓకేవైపు పరిమితం కారు. స్థానిక పరిస్థితులు, సిద్ధాంతాలు, అభీష్టాల ఆధారంగా ఓట్లు వేస్తారు. అందుకే అక్కడ కాన్షీరామ్, మాయావతి నిలబెట్టిన అభ్యర్థులు వరుసగా ఓడిపోయారు. 

ఇప్పుడు కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి చేయడంతో దళితుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సిక్కు జాట్లలో నిరుత్సాహం నెలకొంది. పంజాబ్ రాష్ట్ర పవర్ పిరమిడ్ లో సిక్కు జాట్లు యాభై ఐదేండ్లుగా వారి హవా కొనసాగుతోంది. పంజాబ్ రాష్ట్ర జనాభాలో వీరి వాటా 25 శాతం ఉంటుంది. హరిత విప్లవం నుంచి లబ్ధి పొందిన వీరు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడి ఉన్నారు. తాజా సమీకరణాలు వీరి నుంచి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసినా, కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి చేసింది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించింది. ప్రజల 
అంచనాలను అందునేవిధంగా చన్నీకి మార్గనిర్దేశం చేసింది. చన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయనున్నారు. డ్రగ్స్ పై నిషేధం, ఇసుక మాఫియాను ఏరివేయడం, 2014-15లో పోలీసు కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు న్యాయం చేయడం, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడం తదితర వాగ్దానాలు అమలు చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గెలవాలనే ఎత్తులు వేస్తూ పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: