భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో పోడు భూముల వివాదం గుబులు రేపుతోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావులకు పోడు భూముల సెగ గట్టిగానే తాకుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోడు భూముల రైతులు ఆందోళన దిగారు. ఎమ్మెల్యే లు వనమా,రేగా హరిప్రీయ,మెచ్చా నాగేశ్వర్ రావు రాజీనామా చేయాలంటూ వారి ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు రాజీనామా చేయాలంటూ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడి ఆందోళన చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్య గత పదిహేను ఏండ్లుగా కార్చిచ్చులా రగులుతూనే ఉంది. కేసీఆర్ రెండో సారీ అధికారంలోకి వచ్చినా పోడు రైతులకు పట్టాలు ఇవ్వలేదు. మొదటి టర్మ్ పాలనలో కేసీఆర్ మాట తప్పడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఎక్కడా  టీఆర్ఎస్ గెలవలేదు. టీఆర్.ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో పోడు రైతుల సమస్య. టీఆర్.ఎస్ పోడు రైతులను మోసం చేసిందంటూ ఎన్నికల్లో గొంతెత్తి గెలిచిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ తరపున గెలిచి కొద్ది రోజులకే టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ నుంచి గెలిచిన అశ్వరావుపేట ఎమ్యెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్‌లో చేరగా కాంగ్రెస్ తరపున గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం పార్టీ మారలేదు.

ప్రస్తుతం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి.. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందనే టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. పార్టీ మారేముందు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా పోడు రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యత మాది, ప్రతిపక్షంలో ఉంటే పనులు కావు, అందుకే పార్టీ మారుతున్నామంటూ గొప్పలు చెప్పారు. కానీ టీఆర్.ఎస్‌లో చేరి రెండున్నర ఏళ్లు అవుతున్నా పోడు రైతులకు పట్టాలు ఇప్పించలేదు. పట్టాల మాట దేవుడెరుగు.. ఉన్న పంట పొలాలను హరితహారం పేరుతో అటవీ శాఖ సిబ్బంది ధ్వంసం చేస్తుంటే, పోడు రైతులకు అటవీ సిబ్బంది మధ్య నిత్యం రావణకాష్టంలా ఏజెన్సీలో పోడు రగడ కార్చిచ్చులా మారింది. పోడు భూముల్లో పంటలను పీకేసి,మహిళా రైతులపై కూడా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తుంటే, కళ్లెదుట అడవినే నమ్ముకున్న ఆదివాసీల పంట మొక్కలను ధ్వంసం చేసి వారి గుడిసెలు పీకేస్తుంటే ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదు. ఎక్కడ పోడు రైతుల పక్షాన మాట్లాడితే సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురవుతామో అనే భయం, మరోపక్క నియోజవర్గంలో ఏ మొహం పెట్టుకుని వెళ్లాలీ అనే దిగులు పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: