అటవీ అధికారులు అడవులలో అన్నల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని, వారిని అడవులలోకి రానిచ్చేది లేదని సిపిఐ, సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. పోడు భూముల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల పై అటవీ, పొలిసు అధికారుల ఆగడాలు మితిమీరిపోయాయని అందుకే వాళ్ళను అడవిలో అడుగు పెట్టబోనివ్వమని వారు అన్నారు. ఖమ్మం జిల్లా కొలిజర్ల మండలం గుబ్బగుర్తి, కారేపల్లి మండలం చీమలపాడు లో సదస్సు నిర్వహించిన చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్ర అధికారులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలు అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెల్లాని చూస్తున్నాయని అన్నారు.

ఈ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వలన గిరిజనులకు ఒరిగేది ఏమి లేదని నేతలు అన్నారు. న్యూ  డెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ ఈ భూములను సాగుచేసుకుంటున్న మహిళలు, చిన్నారులు, చివరికి పశువులపై కూడా కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లుతుందని విమర్శించారు. ఈ పోరాటం ఆగబోదని, స్థానికులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని నేతలు అన్నారు. అక్టోబర్ 5న పోరాటంలో భాగంగా రహదారుల  దిగ్బంధం కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు రహదారుల నిర్బంధం జరుగుతుంది. ఆయా వర్గాలు ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

పోడు భూముల హక్కుల కోసం అక్కడి గిరిజనులు, ఇతరులు ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకున్న వారు లేరు కానీ నేడు ఖనిజ సంపద కోసం వాళ్ళ హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నేతలు విమర్శించారు. ఈ సదస్సులో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్, టిజెఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపగాని శంకరరావు, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, భాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు 27న రైతుల ఉద్యమం కోసం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. దీనికి అనేక వర్గాలు, రాష్ట్రాలు కూడా మద్దతు ప్రకటించాయి. తాజాగా మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ భారత్ బంద్ కు తెలుగు రాష్ట్రాలు కూడా మద్దతు ప్రకటించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: