బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బీజేపీతో సై అంటే సై అంటోంది. బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌కు వ్య‌తిరేకంగా బీజేపీ త‌ర‌ఫున మోడీ, అమిత్ షాలు ప్ర‌చారం చేసినా ఆమె విజ‌యాన్ని ఆప లేక‌పోయారు. దీంతో బీజేపీని మ‌ట్టి క‌రిపించి సీఎం సీటును అధిష్టించారు. అనంత‌రం బీజేపీ కి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ గట్టే ప్ర‌య‌త్నాలు చేశారు. దీని కోసం బీజేపీ వ్య‌తిరేక పార్టీల నాయ‌కుల‌కు లేఖ‌లు కూడా రాశారు ఆమె.


 అయితే,  కేంద్రంపై ఇప్పుడు ఓ విష‌యంలో మ‌మ‌త తీవ్రంగా మండిప‌డుతున్నార‌ట‌. ఎందుకంటే.. వాటిక‌న్ సిటీలో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సుకు మ‌మ‌తా బెన‌ర్జీకి ఆహ్వానం అందింది. దీంతో రోమ్ కు వెళ్తాన‌ని కేంద్రానికి అనుమ‌తి కోరుతూ లేఖ రాసింది మ‌మ‌త‌, అయితే.. దీనిపై కేంద్రం ఎలాంటి రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డంతో కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు ఆమె.


     వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌బోయే స‌ద‌స్సులో ప‌శ్చిమ బెంగాల్ సీఎంగా త‌న‌కు ఆహ్వానం అందింది. అయితే, దీనికి అనుమ‌తి కోరితే కేంద్రం నిరాక‌రించింది. ఈ స‌ద‌స్సులో జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఏంజెలా మార్కెల్‌, పోప్ ఫ్రాన్సిస్‌, ఇట‌లీ ప్ర‌ధాని కూడా పాల్గొన‌నున్నారు. ఈ స‌ద‌స్సుకు కేంద్ర ప్ర‌తినిధి బృందాన్ని తీసుకురాకుండా త‌న‌ను ఒక్క‌రినే ర‌మ్మ‌ని ఆహ్వానించార‌ని మ‌మ‌త పేర్కొంది. తాను ఒంట‌రిగానే వెళ్తాన‌ని కేంద్రాన్ని కోరినా స్పందించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే, ఒక దేశం త‌ర‌ఫున ప్ర‌తినిధిగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి పాల్గొన‌డానికి అర్హ‌త లేదు అన్న‌ట్టుగా విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది.


  అక్టోబ‌ర్ లో రోమ్ లో జ‌రిగే శాంతి స‌ద‌స్సుకు త‌నకు ఆహ్వానం అందింద‌ని, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం త‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని మ‌మ‌త ఆరోపిస్తున్నారు. అయితే, మ‌మ‌తా బెన‌ర్జీ ఎప్పుడు చూసినా భార‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక గ‌ళం వినిపిస్తుంది. ఈ క్ర‌మంలో దేశం తర‌ఫున ఆమెను పంపిస్తే, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచం ముందు మాట్లాడే అవ‌కాశముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల భావిస్తున్నారు. ఇలా అయితే, ప్ర‌పంచ దేశాల ముందు భార‌త దేశం ప‌రువు పోతుంద‌నే మ‌మ‌త‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది.


   

మరింత సమాచారం తెలుసుకోండి: