హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ఉరుములేని పిడుగులా పడింది. ఈ ఎన్నికలను వాయిదా వేసిన 24 రోజులకే షెడ్యూల్ ప్రకటించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల  నోటిఫికేషన్ ఊహించని విధంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు ఇప్పట్లో ఉండబోవని పండగ సీజన్ అయిన తర్వాతే వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ పండగలు అయి పోకముందే ప్రచారం హోరెత్తించే లా షెడ్యూల్ లో ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎందుకు ఇంత హడావిడిగా షెడ్యూల్ ప్రకటించింది? ఇంత మాత్రం దానికి వాయిదా అనే నిర్ణయాన్ని గతంలో ఎందుకు తీసుకున్నారు అనే సందేహాలు అందరి మనసులో మెదులుతూనే ఉన్నాయి.

సెప్టెంబర్ 4వ తేదీన ఈసీ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒడిషా,  బెంగాల్ మినహా అన్ని చోట్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పింది. దీని కారణంగా ఒడిస్సా,  బెంగాల్ మినహా ఉప ఎన్నికలు జరగాల్సిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా పరిస్థితులు, పండుగ సీజన్ కారణంగా వాయిదా వేయాలని కోరారు. దీంతో ఎన్నికల సంఘం ఒడిస్సా,  బెంగాల్ లో మాత్రమే ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వాయిదా నిర్ణయం తీసుకొని 24 రోజులు కూడా గడవలేదు మళ్లీ వాయిదా వేసిన చోట ఎన్నికలు నిర్వహించాలని ఈసి నిర్ణయించింది. అయితే ఎన్నికలు నిర్వహించాలని  మళ్లీ ఆయా ప్రభుత్వాలు కోరాయ లేదా అన్న దానిపై ఈసి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయా ప్రభుత్వాలు కోరినందున వాయిదా వేసినట్లుగా చెప్పింది కానీ ఇప్పుడు ప్రకటించడానికి మాత్రం కారణం ఏంటో చెప్పలేదు. ఈసి  ఇంత హఠాత్తుగా షెడ్యూల్ ని ప్రకటించడానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే గతంలో వాయిదా ఈ సమయంలో సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన లో ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన కేసీఆర్ దాదాపుగా 7, 8 రోజులపాటు అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నప్పుడే ఈసి ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూడా కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఆదివారం, సోమవారం రెండుసార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.

అయితే ఇందుకోసమే కెసిఆర్, అమిత్ షా తో సమావేశమయ్యారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే యాదృచ్చికంగానైనా రెండు సార్లు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. పండుగ సీజన్ అయిపోయిన తర్వాత ఉప ఎన్నికల గురించి ఆలోచిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం మనసు మార్చుకోవడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ని ఒక్కో స్థానంతో పాటు, దేశవ్యాప్తంగా 3 లోక్  సభ నియోజకవర్గాలు,  30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఒక్క హుజురాబాద్ నియోజకవర్గాన్నే  దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ ఇచ్చారని ఎవరూ అనుకోవడం లేదు.కెసిఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని తెర వెనుక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: