గులాబ్‌ తుపాన్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులను కుదేలు చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు జిల్లా రైతులను నట్టేట ముంచాయి. ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షాల‌కు తోడు వాగులు, న‌దులు ఉప్పొంగ‌డంతో పెద్ద మొత్తంలో పంట‌లు నీట మునిగాయి. ముఖ్యంగా మంచిర్యాల-నిర్మల్ జిల్లాల్లో అధికంగా పంట నష్టం జరిగింది. క‌ళ్ల‌ముందే వేలాది ఎక‌రాల పంటలు వ‌ర‌ద పాల‌య్యాయి. ఎగువ నుంచి న‌దుల్లో చేరిన భారీ వ‌ర‌ద‌తో పలుచోట్ల పంటలు ఆన‌వాళ్లు లేకుండా  దెబ్బతిన్నాయి. అప్ప‌టి దాకా ఆశాజ‌న‌కంగా ఉన్న పంట‌ల‌ను చూసి అనంద ప‌డిన అన్న‌దాత‌లకు తీవ్ర‌ న‌ష్టం వాటిల్లింది.  నీట మునిగిన పంట‌ల‌ను చూసి క‌న్నీరుమున్నీర‌ు అవుతున్నారు.  కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వేలకు వేలు వెచ్చించి కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులు భారీగా నష్ట పోయారు.  ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.


భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని గోదావ‌రి న‌ది ఉప్పొంగ‌డంతో తీర ప్రాంతాల్లో ఉన్న ప‌త్తి, మిర్చి, వరి పంటలు నామ‌రూపాలు లేకుండా పోయాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదకు తోడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేయడంతో నిర్మల్ జిల్లా బాసర మొదలు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ వేలాది ఎకరాల పంటలు నీటి పాలయ్యాయి. బ్యాక్ వాట‌ర్ హజీపూర్, జన్నారం, చెన్నూరు, కోట‌ప‌ల్లి , వేమ‌న‌ప‌ల్లి మండ‌లాల్లో వేల ఎక‌రాల్లో ప‌త్తి, మిర్చి పంట‌లు నీట మునిగాయి. సుంద‌ర‌శాల‌, న‌ర్స‌క్క‌పేట‌, పొక్కూరు, చింత‌ల‌ప‌ల్లి గ్రామాల్లో అధిక న‌ష్టం జ‌రిగింది. అటు  కోట‌ప‌ల్లి మండ‌లంలోని కొల్లూరు, రాంపూర్, దేవుల‌వాడ‌ గ్రామాల్లో 10 వేల‌కుపైగా ఎక‌రాల్లో ప‌త్తి, మిర్చి, వరి పంట నీట మునిగింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు మూడుసార్లు పంటలు నీటి పాలయ్యాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు విలపిస్తున్నారు.  గత రెండు నెలల వ్యవధిలో కొమురం భీం జిల్లాలో45 వేల ఎకరాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో 15వేల ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 17 వేల ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటికీ స్పందించలేదు. అయినా రైతులు మరోసారి సాగు చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు పంటలు వరద పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: